Samsung Galaxy Unpacked 2026: రేపే శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026.. ఎక్కడ చూడాలి,లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
ఈ వార్తాకథనం ఏంటి
రేపే టెక్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్నశాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకలో శాంసంగ్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ S26 సిరీస్‌ను అధికారికంగా ఆవిష్కరించనుంది. ఫిబ్రవరి 25న ఉదయం 10 గంటలకు పీటీ సమయం ప్రకారం, భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్నిశాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్‌లో "జీరో-పీకింగ్ ప్రైవసీ" అనే ప్రత్యేక ఫీచర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ వల్ల ఇతరులు మీ మొబైల్ స్క్రీన్‌లోని వ్యక్తిగత సమాచారం చూడకుండా రక్షణ లభిస్తుంది.
వివరాలు
బిక్స్‌బీ,జెమినీతో పాటు 'హే ప్లెక్స్' సపోర్ట్… ఎస్26 అల్ట్రాలో ఏఐ పవర్ ఫుల్ ఎంట్రీ!
అంతేకాదు, ఇప్పటికే ఉన్న బిక్స్‌బీ, జెమినీ సపోర్ట్‌తో పాటు "హే ప్లెక్స్" అనే హాట్‌వర్డ్ ద్వారా పర్‌ప్లెక్సిటీతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఈ డివైస్‌లో ఉండనుంది. కెమెరా విషయానికి వస్తే, గెలాక్సీ S26 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50ఎంపీ 5ఎక్స్ టెలిఫోటో, 10ఎంపీ 3ఎక్స్ టెలిఫోటో, 50ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్‌లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉండొచ్చని అంచనా. ముందుభాగంలో 12ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశముంది. మార్కెట్‌ను బట్టి ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్5 లేదా ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్‌తో రానుంది. గెలాక్సీ S26లో 6.3 అంగుళాల AMOLED డిస్‌ప్లే, S26 ప్లస్‌లో 6.7 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉండనుంది.
వివరాలు
పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఎస్26 సిరీస్… వన్ యూఐ 8.5కి రెడీ అవుతున్న సామ్‌సంగ్!
ఈ రెండు ఫోన్లు కూడా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్5 లేదా ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్లతో రానున్నాయి. సాధారణ మోడల్‌లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుందని తెలుస్తోంది. ఇదే వేడుకలో వన్ యూఐ 8.5 అనే తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను కూడా సామ్‌సంగ్ ప్రకటించే అవకాశముంది.
వివరాలు
అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఏఐ సర్‌ప్రైజ్‌లు.. వేరబుల్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్ !
ఇందులో ఎక్స్‌టెండెడ్ డార్క్ థీమ్, మెరుగైన హోమ్ అప్ సపోర్ట్, లాక్‌స్క్రీన్ విడ్జెట్ సపోర్ట్‌తో పాటు నోటిఫికేషన్ సమ్మరీలాంటి కొత్త ఏఐ ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. అలాగే గెలాక్సీ బడ్స్ 4, బడ్స్ 4 ప్రోలను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్ కంపెనీలతో కలిసి రూపొందిస్తున్న స్మార్ట్ ఏఐ గ్లాసెస్‌పై కూడా టీజర్ ఇవ్వొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వేరబుల్స్ అధికారిక లాంచ్ పై మాత్రం ఇంకా స్పష్టత లేదు.