Samsung Galaxy Watch : స్పృహ కోల్పోవడానికి ముందే హెచ్చరిక.. శాంసంగ్ సరికొత్త గెలాక్సీ వాచ్ ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆరోగ్య సాంకేతిక రంగంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో తొలిసారిగా, తమ గెలాక్సీ చేతి గడియారం సహాయంతో వాసోవేగల్ సిన్‌కోప్ అనే ఆకస్మిక మూర్ఛ సమస్యను ముందుగానే గుర్తించగలమని ప్రకటించింది. దక్షిణ కొరియాలోని చుంగ్-ఆంగ్ విశ్వవిద్యాలయం గ్వాంగ్‌మయాంగ్ ఆసుపత్రితో కలిసి నిర్వహించిన వైద్య పరిశోధనలో ఈ ఫలితాలు లభించాయని మే 7న వెల్లడించింది. ఈ వివరాలు 'యూరోపియన్ హార్ట్ జర్నల్ - డిజిటల్ హెల్త్'లో ప్రచురితమయ్యాయి.
వివరాలు
ఏమిటి ఈ మూర్ఛ సమస్య?
వాసోవేగల్ సిన్‌కోప్ అనేది గుండె స్పందనలు, రక్తపోటు ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గి స్పృహ కోల్పోయే పరిస్థితి.
ఇది సాధారణంగా ప్రాణాపాయం కలిగించకపోయినా, ఆకస్మికంగా పడిపోవడం వల్ల తలకు గాయాలు, ఎముకలు విరగడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారని అంచనా.
వీరిలో మూడింట ఒక వంతు మందికి ఇది పదేపదే వస్తుంది. అందుకే ముందస్తు హెచ్చరిక అత్యంత కీలకం.
వివరాలు
పరిశోధన విధానం
ఈ అధ్యయనంలో వాసోవేగల్ సిన్‌కోప్ లక్షణాలు ఉన్న 132 మంది రోగులపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల సమయంలో గడియారంలోని సెన్సార్ ద్వారా గుండె స్పందనల్లో మార్పులను నిరంతరం నమోదు చేశారు.
అనంతరం కృత్రిమ మేధస్సు ఆధారంగా ఈ సమాచారాన్ని విశ్లేషించారు.
ఫలితంగా, రోగి స్పృహ కోల్పోయే ఐదు నిమిషాల ముందే 84.6 శాతం కచ్చితత్వంతో హెచ్చరిక ఇవ్వగలమని తేలింది.
వివరాలు
నిపుణుల అభిప్రాయం
ఈ విజయంపై పరిశోధనలో పాల్గొన్న గుండె సంబంధిత వైద్య నిపుణుడు జున్‌హ్వాన్ చో మాట్లాడుతూ, ముందస్తు హెచ్చరిక వల్ల రోగులు సురక్షిత ప్రదేశానికి చేరుకోవడం లేదా సహాయం పొందడం సాధ్యమవుతుందని తెలిపారు.
దీనివల్ల ప్రమాదవశాత్తు జరిగే గాయాలను గణనీయంగా తగ్గించవచ్చు" అని వివరించారు.
సంస్థ స్పందన
సంస్థ ఆరోగ్య పరిశోధన విభాగం అధికారి జాంగ్‌మిన్ చోయి మాట్లాడుతూ, ఈ పరిశోధన ద్వారా ఆరోగ్య సంరక్షణలో ముందుజాగ్రత్తకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు.
వినియోగదారులు ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ విజయంతో వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో మరిన్ని కొత్త మార్గాలను వేగంగా అభివృద్ధి చేస్తామని సంస్థ వెల్లడించింది.