Earthquakes: భూకంపాలను కృత్రిమంగా సృష్టిస్తున్న స్విస్ శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఉద్దేశ్యపూర్వకంగా చిన్న స్థాయి భూకంపాలను సృష్టిస్తున్నారు. ఇవన్నీ జీరో మ్యాగ్నిట్యూడ్ తక్కువ కంపనలు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారంటే.. భూకంపాలు ఎలా మొదలౌతాయి, కొన్ని ఫాల్ట్‌లపై ఎందుకు ఎక్కువ విస్తీర్ణం మీద ప్రభావం చూపుతాయి అన్న విషయాలను అర్థం చేసుకోవడానికే. FEAR (Fault Activation and Earthquake Rupture) ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు భూకంపాలు జరిగిన తర్వాతే వాటి గురించిన డేటాను అధ్యయనం చేయగలుగుతున్నామని, అందుకే నియంత్రిత పరిస్థితుల్లో భూకంపాలను కృత్రిమంగా సృష్టిస్తున్నామని చెబుతున్నారు.
వివరాలు
రైల్వేనిర్మాణం కోసం వేసిన పురాతన సొరంగంలోనే ఈ ప్రయోగం
ETH జ్యూరిచ్‌కు చెందిన భూకంప శాస్త్ర నిపుణుడు డొమెనికో జియార్డిని మాట్లాడుతూ,"ప్రకృతి ముందే ఏ సంకేతాలు ఇస్తుంది? అవి స్పష్టంగా భూకంపం జరిగిన తర్వాతే తెలుస్తాయి. అందుకే మేము ఈ ముందస్తు సంకేతాలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం"అన్నారు. ఈ పరిశోధనకు ఆల్ప్స్ ఎందుకంటే..ఇక్కడ పర్వతాల లోతుల్లో అనేక కోట్ల ఏళ్లుగా ఏర్పడిన ఫాల్ట్‌లు, గాయాల్లాంటి విభజనలు ఉన్నాయి. రైల్వేనిర్మాణం కోసం వేసిన పురాతన సొరంగంలోనే ఈ ప్రయోగం జరుగుతోంది. ఇక్కడ ఫాల్ట్‌ల ఏర్పాటే ఎక్కువ కావడంతో చిన్న కదలికలు సహజంగానే వస్తుంటాయి. శాస్త్రవేత్తలు ఇవే ఫాల్ట్‌లలోకి నీటిని పంపించి కృత్రిమభూకంపాలను సృష్టిస్తున్నారు. ఇది చమురు-గ్యాస్ కంపెనీలు ఇంజెక్షన్ విధానం ద్వారా ఫాల్ట్‌లలో రాయిల మధ్య రాపిడిని తగ్గించడానికి చేసే ప్రక్రియలానే ఉంటుంది.
వివరాలు
విజయవంతంగా లక్షల్లో జీరోమ్యాగ్నిట్యూడ్ భూకంపాలు
జియార్డిని చెప్పినట్లుగా..ఈ కంపనలు ఆల్ప్స్ పర్వతాల జీవితకాలంలో ఏదో ఒక సమయంలో సహజంగానే వచ్చేవి, కానీ ఇప్పుడు వారు అవి ఎప్పుడు రావాలో నిర్ణయించుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ భారీ సంఖ్యలో సైస్మామీటర్లు,యాక్సిలెరోమీటర్లు అమర్చి ప్రతి చిన్న కదలికను రికార్డు చేస్తున్నారు. ఇప్పటివరకు లక్షల్లో జీరోమ్యాగ్నిట్యూడ్ భూకంపాలను విజయవంతంగా సృష్టించారు. భూకంపాలు జీరోకన్నా మైనస్‌లో కూడా నమోదవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే మార్చిలో మ్యాగ్నిట్యూడ్‌ను ఒకటి వరకు పెంచే ప్లాన్‌లో ఉన్నారు. ఇంకా తదుపరి దశగా వేడినీటిని ఫాల్ట్‌లోకి పంపించి ఉష్ణోగ్రత మార్పులు భూకంప అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయో చూడనున్నారు. మొత్తంగా,ఈ అధ్యయనం భూకంపాలు ఏ పరిస్థితుల్లో,ఏ పరిమాణంలో సంభవిస్తాయో ముందే అంచనా వేయడానికి,ఏ ఫాల్ట్‌లు ప్రమాదకరమో గుర్తించడానికి పెద్దగా ఉపయోగ పడనుంది.