శని గ్రహం చుట్టూ 62కొత్త చంద్రులను కనుగొన్న శాస్త్రవేత్తలు; మళ్లీ అగ్రస్థానంలోకి 'సాటర్న్'
ఖగోళ శాస్త్రవేత్తలు శని గ్రహం చుట్టూ 62 కొత్త చంద్రులను కనుగొన్నారు. దీంతో శని గ్రహం చుట్టూ ఉన్న మొత్తం చంద్రుల సంఖ్య 145కి చేరుకుంది. విశ్వంలో 100 కంటే ఎక్కువ చంద్రులు చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి గ్రహంగా శని నిలిచింది. ఈ నెల ఫిబ్రవరిలో శాస్త్రవేత్తలు 12కొత్త చంద్రులను బృహస్పతి చుట్టూ తిరుగుతున్నట్లు కనుగొన్నారు. దీంతో అప్పటి వరకు టాప్‌లో ఉన్న తన స్థానాన్ని కోల్పోయింది. తాజాగా 62 కొత్త చంద్రులను కనుగొనడంతో శనిగ్రహం తిరిగి అగ్రస్థానంలోకి వచ్చింది.
'షిఫ్ట్ అండ్ స్టాక్' అనే పద్ధతిని ఉపయోగించి చంద్రుల గుర్తింపు
అకాడెమియా సినికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌లో పోస్ట్‌డాక్టోరల్ ఫెలో అయిన ఎడ్వర్డ్ ఆష్టన్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం చంద్రులను కనుగొన్నారు. 'షిఫ్ట్ అండ్ స్టాక్' అనే పద్ధతిని ఉపయోగించి చంద్రులను కనుగొన్నారు. శని గ్రహం చుట్టూ తిరిగే కొత్త చంద్రులు 'క్రమరహితమైనవి' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గురుత్వాకర్షణ ద్వారా చంద్రులు శని గ్రహం చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నట్లు చెప్పారు. ఖగోళంలోని ఒక వస్తువును అంతర్జాతీయ ఖగోళ యూనియన్ (ఐఓయూ) చంద్రునిగా గుర్తిస్తుంది. ప్లూటో గ్రహం కాదని చెప్పిన సంస్థ కూడా ఐఓయూ కావడం గమనార్హం.