SEBI AI Model: స్టాక్ మార్కెట్ కోసం భారత్ సరికొత్త ఏఐ మోడల్...సెబీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లోనూ ఈ సాంకేతికతను మరింత సమర్థంగా ఉపయోగించేందుకు సెబీ సిద్ధమవుతోంది. సెక్యూరిటీస్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా భారత్‌లోనే ప్రత్యేక ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే శనివారం CNBC-Awaaz నిర్వహించిన 'మార్కెట్ మహాకుంభ్ 2026' కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మార్కెట్‌కు సంబంధించిన కీలక సమాచారం భద్రంగా ఉండటమే ఈ ప్రతిపాదనలో ప్రధాన ఉద్దేశమని వివరించారు.
Details
డేటా గోప్యతే ప్రధాన ఆందోళన
ప్రస్తుతం ఎన్నో ఏఐ మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వాటిలో సమాచారాన్ని వినియోగించినప్పుడు మన డేటా ఎంతవరకు గోప్యంగా ఉంటుందనే సందేహాలు వినియోగదారుల్లో ఉన్నాయి.
ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు, సంస్థలు, లావాదేవీలకు సంబంధించిన సమాచారం అత్యంత కీలకం.
అలాంటి డేటా భద్రత విషయంలో రాజీ పడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏఐ మోడల్ అవసరమని సెబీ భావిస్తోంది.
అందుకే ఇతర అవసరాల కోసం రూపొందించిన సాధారణ ఏఐ వ్యవస్థలకు బదులుగా, సెక్యూరిటీస్ మార్కెట్ పనితీరుకు సరిపోయే మోడల్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.
Details
భారత్‌లోనే అభివృద్ధి.. డిజిటల్ వ్యవస్థలో భాగం
ఈ ఏఐ మోడల్‌ను దేశంలోనే అభివృద్ధి చేయడంతో పాటు, భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగం చేయాలన్నది సెబీ లక్ష్యం.
అంటే దేశీయ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించి, మార్కెట్ కార్యకలాపాల్లో ఉపయోగించాలనుకుంటోంది.
దీనికోసం కేవలం సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మాత్రమే కాకుండా, దాన్ని సమర్థంగా వినియోగించగల నిపుణులను తయారు చేయడంపైనా దృష్టి పెట్టింది.
Details
ఇంజినీర్లకు ఏఐ శిక్షణ
సెక్యూరిటీస్ మార్కెట్ కార్యకలాపాలను పర్యవేక్షించే ఇంజినీర్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సెబీ భావిస్తోంది.
రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (NISM) సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించే ప్రణాళిక ఉంది.
ఇందులో ఏఐ టూల్స్ ద్వారా హెచ్చరికలను విశ్లేషించడం, ఆటోమేటిక్‌గా స్పందనలు పంపడం, సైబర్ భద్రతను మెరుగుపరచడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ ప్రయత్నం అమల్లోకి వస్తే స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో వేగం, భద్రత మరింత మెరుగుపడే అవకాశం ఉంది.