LOADING...
Elon Musk: ట్విట్టర్ కేసులో సంచలనం.. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన మస్క్!
ట్విట్టర్ కేసులో సంచలనం.. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన మస్క్!

Elon Musk: ట్విట్టర్ కేసులో సంచలనం.. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన మస్క్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ డీల్‌కు ముందు మస్క్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించినట్లు అమెరికా జ్యూరీ తేల్చింది. ట్విటర్ కొనుగోలు ప్రక్రియకు కొన్ని నెలల ముందే ఉద్దేశపూర్వకంగా ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేసినట్లు జ్యూరీ అభిప్రాయపడింది. ఈ చర్యల కారణంగా ట్విటర్ షేర్ల విలువ పడిపోయిందని కూడా పేర్కొంది. అయితే షేర్ ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలను మాత్రం జ్యూరీ తిరస్కరించింది. ట్విటర్ కొనుగోలు పూర్తి కావడానికి ముందు దాఖలైన ఈ కేసుపై విచారణ జరిపిన జ్యూరీ, మస్క్ చేసిన ట్వీట్లు, పాడ్‌కాస్ట్ వ్యాఖ్యలు మరియు పలు ప్రకటనలు పెట్టుబడిదారులపై ప్రభావం చూపాయని గుర్తించింది.

Details

మార్చి 2న విచారణ ప్రారంభం

ముఖ్యంగా 2022 మే నెలలో ఆయన ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చేసిన ట్వీట్లు, ఇతర వ్యాఖ్యలు కారణంగా పలువురు వాటాదారులు తమ షేర్లను అమ్ముకున్నారని పిటిషనర్లు వాదించారు. ఈ కేసుపై శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో మార్చి 2న విచారణ ప్రారంభమైంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన జ్యూరీ, మస్క్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించినట్లు తేల్చింది. అలాగే ట్విటర్ కొనుగోలు ముందే షేర్లు విక్రయించిన వాటాదారులకు నష్టపరిహారం చెల్లించాలని టెస్లా అధినేతకు ఆదేశాలు జారీ చేసింది.

Details

ట్విటర్‌లో నకిలీ ఖాతాల సంఖ్య అధికం

ఇదిలా ఉండగా, ట్విటర్‌లో నకిలీ ఖాతాల సంఖ్య అధికంగా ఉందనే కారణంతో కొనుగోలు నుంచి వెనక్కి తగ్గేందుకు ప్రయత్నించానని మస్క్ ముందుగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్విటర్ సంస్థ డెలావేర్ కోర్టును ఆశ్రయించడంతో చివరికి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆయన తెలిపారు. అంతిమంగా 2022 అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 44 బిలియన్ డాలర్లకు ఈ డీల్ పూర్తయింది.

Advertisement