Signal Screenshot Restriction: ఏఐ నిఘా భయంతో సిగ్నల్ సంచలన నిర్ణయం.. స్క్రీన్‌షాట్లకు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రైవసీకి పెద్దపీట వేసే మెసేజింగ్ యాప్ సిగ్నల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్‌లోని చాట్‌లను మొబైల్ స్క్రీన్‌షాట్ తీసే అవకాశాన్ని పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏజెంట్లు యూజర్ల స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని పరిశీలించే ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు తీసుకొచ్చింది. సిగ్నల్ అధ్యక్షురాలు మెరెడిత్ విటేకర్ మాట్లాడుతూ.. ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఏఐ ఏజెంట్లకు పెరుగుతున్న సామర్థ్యాలు తమ ప్రైవసీ రక్షణకు పెద్ద సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను ఆమె 'అస్తిత్వ ముప్పు'గా అభివర్ణించారు.
Details
స్క్రీన్‌పై ఉన్న సమాచారానికీ ఏఐ యాక్సెస్
ప్రస్తుతం విండోస్, ఆండ్రాయిడ్, మాకోస్, ఐఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఏఐ ఆధారిత ఫీచర్లు వేగంగా పెరుగుతున్నాయి.
యూజర్ స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని ఏఐ ఏజెంట్లు స్కాన్ చేయగలిగితే.. వ్యక్తిగత మెసేజ్‌లు, ఫొటోలు, ఇతర సున్నితమైన వివరాలు కూడా వాటి పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకసారి ఆ సమాచారం యాప్ నియంత్రణ దాటి ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలోని స్థానిక డేటాబేస్ లేదా రిమోట్ సర్వర్‌కు చేరితే దానిపై సిగ్నల్‌కు నియంత్రణ ఉండదని విటేకర్ వివరించారు. ఇదే తమకు ప్రధాన ఆందోళనగా పేర్కొన్నారు.
Details
విండోస్ తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లోనూ
స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని ఇతర ఏఐ వ్యవస్థలు యాక్సెస్ చేసే అవకాశాన్ని తగ్గించేందుకు సిగ్నల్ ఇప్పటికే విండోస్ యాప్‌లో స్క్రీన్‌షాట్‌లను డిఫాల్ట్‌గా బ్లాక్ చేసింది.
ఇప్పుడు అదే తరహా పరిమితులను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లకు కూడా తీసుకొస్తోంది.
అంటే సిగ్నల్‌లోని వ్యక్తిగత సంభాషణలను యూజర్లు స్క్రీన్‌షాట్ రూపంలో సేవ్ చేసుకునే విధానంపై అదనపు నియంత్రణ ఉండనుంది.
ప్రైవసీని మరింత బలోపేతం చేయడమే ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశంగా సంస్థ చెబుతోంది.
Details
సెట్టింగ్ మార్చుకునే అవకాశం కూడా ఉంది
అయితే స్క్రీన్‌షాట్ పరిమితిని యూజర్లు తమకు అనుగుణంగా డిసేబుల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
కానీ అలా చేస్తే సిగ్నల్ అందించే ప్రైవసీ రక్షణలో కొంత భాగం దెబ్బతినే అవకాశం ఉందని విటేకర్ హెచ్చరించారు. అంతేకాదు, ప్రస్తుత మార్పు పూర్తిస్థాయి పరిష్కారం కాదని ఆమె అంగీకరించారు.
ఏఐ ఏజెంట్లు యాప్ డేటాను యాక్సెస్ చేసే మరికొన్ని పరోక్ష మార్గాలను ఈ విధానం అడ్డుకోలేదని తెలిపారు.
దీంతో భవిష్యత్తులో ఏఐ, యూజర్ ప్రైవసీ మధ్య పోరు మరింత కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.