LOADING...
Skyroot Aerospace: భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష యూనికార్న్‌గా స్కైరూట్ ఘనత

Skyroot Aerospace: భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష యూనికార్న్‌గా స్కైరూట్ ఘనత

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్కైరూట్(Skyroot Aerospace) మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా సంస్థ రూ.565 కోట్లు సమీకరించి యూనికార్న్ స్థాయిని అందుకుంది. తాజా పెట్టుబడులతో సంస్థ విలువ రూ.10,360కోట్లకు చేరింది. భారత అంతరిక్ష రంగంలో ఈ స్థాయికి చేరిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ చరిత్ర సృష్టించింది. వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ భారీ పెట్టుబడులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ ధాకా 2018లో ఈ సంస్థను స్థాపించారు. 2022లో విక్రమ్-ఎస్ ప్రయోగంతో అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపిన తొలి భారతీయ ప్రైవేట్ సంస్థగా గుర్తింపు పొందింది.

వివరాలు 

మూడేళ్లలో రెట్టింపు విలువ

హైదరాబాద్‌లోని విస్తృత స్థాయి పరిశోధనా కేంద్రాల్లోనే రాకెట్లను అభివృద్ధి చేస్తూ సంస్థ ముందుకు సాగుతోంది. ప్రముఖ పెట్టుబడిదారు రామ్, శ్రీ రామ్ కు చెందిన షెర్పలో వెంచర్స్(Sherpalo Ventures), సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడి సంస్థ GIC కలిసి ఈ నిధుల సమీకరణకు నాయకత్వం వహించాయి. వీటితో పాటు BlackRock ,గ్రీన్‌కో వ్యవస్థాపకులు, ఆర్కమ్ వెంచర్స్, ప్లేబుక్ పార్ట్‌నర్స్, శాంఘ్వీ కుటుంబ పెట్టుబడి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ ఒప్పందంతో రామ్ శ్రీరామ్ సంస్థ బోర్డులో చేరనున్నారు. 2023లో జరిగిన పెట్టుబడి దశలో సంస్థ విలువ రూ.4,800 కోట్లుగా ఉండగా, మూడేళ్లలోనే అది రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది మార్చిలో బ్లాక్‌రాక్ సంస్థ స్కైరూట్‌కు రూ.100 కోట్ల రుణం కూడా అందించింది.

వివరాలు 

లక్ష్యం విక్రమ్-1 ప్రయోగం

ప్రస్తుతం స్కైరూట్ సంస్థ ప్రతిష్ఠాత్మక విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది మన దేశంలో తొలి ప్రైవేట్ కక్ష్య రాకెట్. ఈ ప్రయోగానికి అవసరమైన వాణిజ్య కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు, ఒక టన్ను సామర్థ్యం కలిగిన అధునాతన క్రయోజెనిక్ రాకెట్ విక్రమ్-2 అభివృద్ధికి తాజా నిధులను వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. 350 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టగల విక్రమ్-1 రాకెట్‌ను త్వరలోనే ప్రయోగించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యనిర్వాహక అధికారి పవన్ కుమార్ చందన మాట్లాడుతూ, ఈ ప్రయోగం దేశానికి మాత్రమే కాకుండా అంతరిక్ష రంగానికీ కీలకమని తెలిపారు.

Advertisement

వివరాలు 

తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం

అంతర్జాతీయ పెట్టుబడిదారులు చూపుతున్న విశ్వాసం సంస్థ ఎదుగుదలకు బలమని అన్నారు. పెట్టుబడిదారు రామ్ శ్రీరామ్ మాట్లాడుతూ, స్కైరూట్ బృందంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం కలిగిన అంతరిక్ష సేవలను అందిస్తూ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని పేర్కొన్నారు.

Advertisement