Nothing CEO: మెమరీ చిప్ కొరతతో ఫోన్ ధరల పెంపు తప్పదు: నథింగ్ సీఈవో
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు 2026లో నిరాశే ఎదురవనుంది. నథింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కార్ల్ పై, వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని హెచ్చరించారు. కారణం ఒక్కటే... మెమరీ భాగాల ధరలు భారీగా పెరగడం. ఎక్స్ (X) వేదికగా చేసిన పోస్టులో కార్ల్ పై మాట్లాడుతూ, 2026 వినియోగ ఎలక్ట్రానిక్స్ రంగానికి "ఎప్పుడూ లేని సంవత్సరం"గా మారొచ్చన్నారు. ఫోన్లు ఫాస్ట్‌గా పనిచేయడానికి ఉపయోగించే NAND, DRAM మెమరీ చిప్స్ ధరలు పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇదే చిప్స్ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఏఐ డేటా సెంటర్లలో కూడా వాడుతున్నారు.
వివరాలు
2026 ప్రారంభంలో కొత్త మోడళ్లు… కానీ ధరలు ఎక్కువే
ఈ పరిస్థితుల్లో ఫోన్ తయారీ కంపెనీలకు రెండు మార్గాలే మిగులుతాయని కార్ల్ పై స్పష్టం చేశారు. ఒకటి ధరలు పెంచడం, లేకపోతే ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో కోతలు పెట్టడం. అయితే నథింగ్ మాత్రం పనితీరులో రాజీ పడకుండా ధరలు పెంచాల్సి వస్తుందని ఆయన తేల్చిచెప్పారు. 2026 తొలి త్రైమాసికంలో నథింగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోందని కార్ల్ పై తెలిపారు. అయితే అవి చౌకగా ఉండబోవని ముందే సంకేతాలిచ్చారు. మెమరీ చిప్స్ ధరలు పెరగడంతో ఫోన్ ధరలు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ల నుంచి మెమరీ చిప్స్‌కు డిమాండ్ భారీగా పెరగడంతో సరఫరాలో కొరత ఏర్పడిందని ఆయన వివరించారు.
వివరాలు
2026 ప్రారంభంలో కొత్త మోడళ్లు… కానీ ధరలు ఎక్కువే
చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించేందుకు స్పెసిఫికేషన్లు తగ్గించే ప్రయత్నం చేస్తాయని, కానీ నథింగ్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోదని చెప్పారు. స్పెక్స్ రేస్‌లో పడిపోకుండా, వినియోగదారులకు ఉపయోగపడే నిజమైన అనుభూతిపై దృష్టి పెట్టడమే తమ లక్ష్యమని కార్ల్ పై పేర్కొన్నారు. 2026 నుంచి ఫోన్ కంపెనీలు సంఖ్యల వెంట పడకుండా, వాస్తవిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఇండస్ట్రీ అంతటా అదే పరిస్థితి
కార్ల్ పై హెచ్చరిక ఒక్క నథింగ్ కంపెనీకే పరిమితం కాదు. మొత్తం స్మార్ట్‌ఫోన్ రంగంలో ఇదే ధోరణి కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. CES 2026లో సామ్‌సంగ్ ప్రెసిడెంట్, సీఎంఓ వోన్-జిన్ లీ కూడా మెమరీ చిప్ కొరత తీవ్రంగా మారుతోందని, అవసరమైతే ధరలు పెంచాల్సి వస్తుందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కౌంటర్‌పాయింట్ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ నివేదికల ప్రకారం, ఏఐ మౌలిక వసతుల కోసం పెరుగుతున్న డిమాండ్ ప్రభావం నేరుగా వినియోగదారులపై పడుతోంది. ఏఐ సర్వర్లు, కొత్త తరం స్మార్ట్‌ఫోన్లు రెండూ ఒకే DRAM, NAND చిప్స్‌ను ఉపయోగిస్తాయి. అయితే లాభాలు ఎక్కువగా ఉండటంతో చిప్ తయారీ కంపెనీలు ఏఐ డేటా సెంటర్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
వివరాలు
బడ్జెట్ ఫోన్లకూ దెబ్బ
దీంతో స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు చిప్స్ దొరకడం కష్టమవుతోంది. ఈ అసమతుల్యత త్వరలో తగ్గేలా కనిపించడం లేదని కౌంటర్‌పాయింట్ హెచ్చరిస్తోంది. 2026 తొలి ఆరు నెలల్లోనే మెమరీ ధరలు 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మెమరీ ధరల పెరుగుదల ఇప్పటికే ఫోన్ తయారీ ఖర్చులపై ప్రభావం చూపిస్తోంది. 200 డాలర్లలోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చులు ఒక్క ఏడాదిలోనే 20 నుంచి 30 శాతం పెరిగాయి. మిడ్-రేంజ్, ఫ్లాగ్‌షిప్ ఫోన్లకూ 10 నుంచి 15 శాతం వరకు ఖర్చులు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
బడ్జెట్ ఫోన్లకూ దెబ్బ
ఏఐ రంగంలో పెట్టుబడులు తగ్గే సూచనలు లేకపోవడంతో, 2026లో కృత్రిమ మేధ ప్రభావం నేరుగా సామాన్య వినియోగదారుడి జేబుపై పడే ఏడాదిగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కార్ల్ పై చేసిన హెచ్చరిక అంచనా కాదు... తప్పని సరి పరిణామంగా మారే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మీ తదుపరి స్మార్ట్‌ఫోన్, మీరు ఊహించినదానికంటే ఖరీదైనదిగా మారొచ్చు.