Lunar Ring project: భూమికి విద్యుత్ కోసం చంద్రుడిపై సోలార్ ప్యానెల్స్.. జపాన్ లూనా రింగ్ ప్రాజెక్ట్ ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
భూమికి విద్యుత్ అందించేందుకు చంద్రుడిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలనే వినూత్న ఆలోచన ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. భవిష్యత్‌లో రోబోలు చిన్నపాటి పనుల నుంచి భారీ ఉపగ్రహాల నిర్మాణం వరకు అన్ని పనులను చేపట్టే రోజులు వస్తాయని భావిస్తున్న తరుణంలో,జపాన్‌కు చెందిన ఓ సంస్థ చంద్రుడి చుట్టూ భారీ సౌర విద్యుత్ వలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మహత్తర ప్రణాళికకు'లూనా రింగ్' అని పేరు పెట్టారు.దీని ద్వారా అపారమైన స్వచ్ఛ శక్తిని ఉత్పత్తి చేసి,దాన్ని భూమికి పంపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రపంచ శక్తి వ్యవస్థనే మార్చివేసే సామర్థ్యం కలిగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆలోచన శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ,ఇప్పుడు దీనిపై సీరియస్‌గా చర్చ జరుగుతోంది.
వివరాలు
లూనా రింగ్ ప్రాజెక్టు అంటే ఏమిటి?
ఈ ఆలోచనను జపాన్ ఇంజినీరింగ్ సంస్థ షిమిజు కార్పొరేషన్ ముందుకు తీసుకొచ్చింది. ఈ సంస్థ చంద్రుడి భూమధ్యరేఖ చుట్టూ భారీ సోలార్ ప్యానెల్స్‌తో కూడిన బెల్ట్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రింగ్ చంద్రుడి చుట్టూ సుమారు 6,800 మైళ్లు అంటే దాదాపు 11,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండొచ్చు. దీని వెడల్పు సుమారు 250 మైళ్లు అంటే 400 కిలోమీటర్ల వరకు ఉండేలా ప్లాన్ చేశారు. ఈ భారీ నిర్మాణం అంతా సోలార్ ప్యానెల్స్‌తో కప్పబడి ఉంటుంది. అంతరిక్షంలో మేఘాలు, వాతావరణం లాంటి ఆటంకాలు ఉండవు కాబట్టి సూర్యకాంతిని నిరంతరం సేకరించే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి, పగలు మార్పులు కూడా విద్యుత్ ఉత్పత్తిపై భూమిలా ప్రభావం చూపవు.
వివరాలు
చంద్రుడిపైనే సోలార్ ప్యానెల్స్ ఎందుకు?
భూమిపై సౌర విద్యుత్ ఉత్పత్తికి అనేక పరిమితులు ఉన్నాయి. రాత్రి సమయంలో సూర్యకాంతి ఉండదు. వాతావరణ పరిస్థితులు, మేఘాలు, ఋతువుల మార్పులు కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కానీ చంద్రుడిపై సూర్యకాంతి మరింత స్థిరంగా లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్షంలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ వ్యవస్థ, భూమిపై ఉన్న సాధారణ సోలార్ ఫారంల కంటే చాలా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదని ఈ ప్రణాళిక చెబుతోంది. ఈ లూనార్ రింగ్ ద్వారా దాదాపు 13,000 టెరావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచానికి అవసరమైన శక్తి డిమాండ్ కంటే కూడా చాలా ఎక్కువ.
వివరాలు
ఆ విద్యుత్ భూమికి ఎలా చేరుతుంది?
చంద్రుడిపై ఉత్పత్తి అయ్యే శక్తి అక్కడే ఉండిపోదు. దానిని మైక్రోవేవ్స్ లేదా లేజర్ కిరణాల రూపంలోకి మార్చి భూమికి పంపించే విధానాన్ని ప్రతిపాదించారు. భూమిపై ప్రత్యేక రిసీవింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఆ శక్తిని స్వీకరిస్తారు. తర్వాత దానిని మళ్లీ విద్యుత్‌గా మార్చి ప్రపంచ పవర్ గ్రిడ్‌తో అనుసంధానిస్తారు. ఈ ప్రణాళిక సక్సెస్ అయితే, నిరంతర పునర్వినియోగ శక్తి సరఫరా సాధ్యమై, ఫాసిల్ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
వివరాలు
ఈ లూనా రింగ్‌లను మనుషులే నిర్మిస్తారా?
షిమిజు సంస్థ ప్రతిపాదించిన ఈ లూనా రింగ్‌ను మనుషులు నేరుగా నిర్మించరు. దీని కోసం చంద్రుడిపై స్వయంచాలక నిర్మాణ రోబోలను వినియోగించే ఆలోచన ఉంది. ఈ రోబోలు చంద్ర మట్టిని తవ్వి, దాన్ని నిర్మాణ సామగ్రిగా మార్చి,చంద్రుడి భూమధ్యరేఖ వెంట సోలార్ ప్యానెల్స్‌ను అమర్చేలా రూపొందిస్తారు. భారీ రోబోటిక్ యంత్రాలు తవ్వకం, పదార్థాల రవాణా, వేల కిలోమీటర్ల మేర సోలార్ అరేల అమరిక వంటి పనులు చేపట్టగలవని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆధునిక రోబోటిక్స్ అభివృద్ధికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ, నాసా భవిష్యత్ చంద్ర మిషన్లు తోడ్పడే అవకాశముందని చెబుతున్నారు.
వివరాలు
భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి ఎలా ఉండొచ్చు?
ప్రస్తుతం ఈ ఆలోచన సైన్స్ ఫిక్షన్‌లా అనిపించినా, భూమి ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి పరిష్కారం ఎలా కనుక్కోవాలనే దిశలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎంత దూరం ఆలోచిస్తున్నారో ఇది చూపిస్తోంది. చంద్రుడిపై రోబోలతో నిర్మాణం, వైర్లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ వంటి సాంకేతికతలు మరింత అభివృద్ధి చెందితే, భవిష్యత్‌లో లూనా రింగ్ వంటి ప్రాజెక్టు నిజంగానే సాధ్యమయ్యే అవకాశముంది.