South Korea: దక్షిణ కొరియాలో సైబర్ దాడుల కలకలం.. బ్రోకరేజ్ సంస్థలు, క్రిప్టో ఎక్స్ఛేంజ్‌పై హ్యాకర్ల గురి!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా ఆర్థిక రంగంలో మరోసారి సైబర్ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆసియాలో కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో జరిగే హ్యాకింగ్ దాడుల ముప్పు పెరుగుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన డైషిన్ సెక్యూరిటీస్, మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థలతో పాటు క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ బిథంబ్‌పై సైబర్ దాడులు జరిగినట్లు వెల్లడైంది. దక్షిణ కొరియా ఆర్థిక సంస్థలపై గత నెలలోనే మరోసారి హ్యాకింగ్ దాడులు జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
వివరాలు
చైనాకు చెందిన హ్యాకర్‌పై అనుమానాలు.. సెప్టెంబర్ దాడులతో సంబంధం?
దక్షిణ కొరియాలో సెప్టెంబర్‌లో జరిగిన సైబర్ దాడుల వెనుక చైనాకు చెందిన వ్యక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఆ హ్యాకర్ 'ఆర్టెక్స్' (Artex) అనే ఏఐ ఆధారిత పెనెట్రేషన్ టెస్టింగ్ సాధనాన్ని ఉపయోగించినట్లు సమాచారం.
అయితే తాజాగా జరిగిన సైబర్ దాడులకు కారణాలేమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, డైషిన్ సెక్యూరిటీస్ సంస్థపై జరిగిన దాడిలో 38,490 మంది ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం బయటపడినట్లు వెల్లడైంది.
ఇందులో వారి పేర్లు, ఈమెయిల్ చిరునామాలు, మొబైల్ ఫోన్ నంబర్లు ఉన్నాయి.
వివరాలు
నష్టపరిహారం చెల్లిస్తాం.. డైషిన్ సెక్యూరిటీస్ హామీ
సైబర్ దాడి ప్రభావానికి గురైన ఖాతాదారులకు డైషిన్ సెక్యూరిటీస్ సంస్థ సమాచారం అందించింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహకరిస్తున్నట్లు తెలిపింది. చట్టప్రకారం బాధితులకు ఏవైనా నష్టాలు వాటిల్లితే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
మరోవైపు, మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్, బిథంబ్ సంస్థలు కూడా వేర్వేరు సైబర్ భద్రతా ఘటనలు జరిగినట్లు వెల్లడించాయి.
అయితే ఈ దాడుల్లో తమ ఖాతాదారుల సమాచారం చోరీకి గురైందని ఆ రెండు సంస్థలూ ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.
వివరాలు
సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయాలి.. దక్షిణ కొరియా ఆదేశాలు
ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలపై వరుసగా సైబర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని దక్షిణ కొరియా ఆర్థిక నియంత్రణ సంస్థ సూచించింది.
ప్రైవేటు రంగానికి చెందిన పలు ఐటీ వ్యవస్థల భద్రతను కూడా తనిఖీ చేయాలని దేశం నిర్ణయించింది.
మరోవైపు, జపాన్‌లోనూ సైబర్ భద్రతకు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
జపాన్‌కు చెందిన జీఎంఓ ఇంటర్నెట్ సంస్థపై సైబర్ దాడి జరిగినట్లు సమాచారం.
అక్కడి ఆర్థిక సంస్థలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.