SpaceX 1 Million Satellites: స్పెస్ ఎక్స్ భారీ ప్లాన్...నింగిలోకి 10 లక్షల ఉపగ్రహాలు...ప్రత్యేకించి వీటికోసమే
ఈ వార్తాకథనం ఏంటి
స్పేస్ ఎక్స్ ఇప్పుడు అంతరిక్షంలో ఊహించని స్థాయిలో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఏఐ డేటా సెంటర్లకు అవసరమైన కంప్యూటింగ్ శక్తిని అంతరిక్షం నుంచే అందించాలన్న లక్ష్యంతో 10 లక్షల ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) అనుమతి ఇచ్చింది. 'స్టార్‌మైండ్' పేరుతో ప్రతిపాదించిన ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం భూమి చుట్టూ ఉన్న మొత్తం యాక్టివ్ ఉపగ్రహాల సంఖ్య కంటే ఎన్నో రెట్లు పెద్దది. అయితే ఇంత భారీ ప్రాజెక్ట్ వల్ల అంతరిక్ష వ్యర్థాలు, వాతావరణంపై ప్రభావం, రాత్రి ఆకాశం రూపమే మారిపోవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి.
Details
పర్యావరణంపై ఎంత ప్రభావం?
10 లక్షల ఉపగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టం ఎంత ఉంటుందనే విషయంలో శాస్త్రవేత్తలు, నియంత్రణ సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకుల అంచనా ప్రకారం ఇలాంటి భారీ ప్రయోగాలు, ఉపగ్రహాల తిరిగి వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల వచ్చే ఉద్గారాలు ప్రస్తుత స్థాయితో పోలిస్తే 70 నుంచి 150 రెట్లు పెరగొచ్చు.
ఇవి ఓజోన్, వాతావరణం, గాలి నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే ఈ అంశాలు తమ పరిధిలోకి రావని FCC పేర్కొంది.
Details
స్పేస్ జంక్ మరింత పెరుగుతుందా?
ఇక్కడే అసలు సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తోంది. తక్కువ భూకక్ష్యలో ఇప్పటికే భారీగా వస్తువులు తిరుగుతున్నాయి.
ఫిబ్రవరి 1 నాటికి 1 మిల్లీమీటర్ నుంచి 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న 23.1 కోట్లకు పైగా అంతరిక్ష వ్యర్థాలు ఉన్నాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది.
ఒక్క శాతం ఉపగ్రహాలు పనిచేయకుండా పోయినా ప్రతి ఏడాది వేలకొద్దీ శిథిలాలు కక్ష్యలో మిగిలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢీకొనే ప్రమాదం కూడా పెరుగుతుంది.
Details
రాత్రి ఆకాశం కూడా మారిపోతుందా?
10 లక్షల ఉపగ్రహాల ప్రభావం కేవలం అంతరిక్షానికే పరిమితం కాకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కొన్ని ఉపగ్రహాలు ఎప్పుడూ సూర్యకాంతిలో ఉండే కక్ష్యల్లో తిరిగితే ఖగోళ పరిశోధనలకు ఉపయోగించే చిత్రాల్లో అవి కనిపించే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా పూర్తయ్యేది కాదు. FCC నిబంధనల ప్రకారం తొలి ఉపగ్రహాన్ని 2033 నవంబర్‌లోపు ప్రయోగించాలి, 2038 నాటికి సగం, 2040 నాటికి మొత్తం 10 లక్షల ఉపగ్రహాల ప్రయోగాన్ని పూర్తి చేయాలి.
అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్ల ఆలోచన ఆసక్తికరంగా ఉన్నా.. దాని పర్యావరణ ప్రభావమే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.