Nasa: అంతరిక్ష కేంద్రంలోకి క్రూ-9 ఎంట్రీ.. స్వాగతం పలికిన సునీతా విలియమ్స్, విల్మోర్
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా చేపట్టిన ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. శనివారం రాత్రి, నాసా-స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌ను ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి విజయవంతంగా లాంచ్ చేశారు. ఇక సోమవారం తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ క్రూ-9 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో విజయవంతంగా డాక్ అయింది. ఈ మిషన్‌లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ISS చేరుకున్నారు. వారు చేరుకున్న వెంటనే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వారికి సాదర స్వాగతం పలికారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి చేరే అవకాశం
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తిరిగి చేరే అవకాశముంది. క్రూ-9 మిషన్‌ను ఈనెల 26న ప్రయోగించాలని తొలుత నాసా భావించినా, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయోగం వాయిదా పడింది. చివరికి, శనివారం సాయంత్రం మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. నాసా వారి రాకను భద్రంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. స్టార్‌లైనర్‌లోని సాంకేతిక సమస్యల కారణంగా వారిని తిరిగి అదే వ్యోమనౌకలో తీసుకురావడం ప్రమాదకరమని నాసా తేల్చి చెప్పింది.