Starlink: భారత్ లో స్టార్‌లింక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇంకా ప్రకటించలేదు.. లారెన్ డ్రేయర్ ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్టార్‌లింక్ (Starlink) సంస్థ, శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్‌లో అందించడానికి సిద్ధమవుతున్నది. ఈ సేవలు వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నిన్న వార్తల ప్రకారం, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలను సంస్థ ప్రకటించినట్టు తెలుస్తోంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ రెసిడెన్షియల్ ప్లాన్ ధర నెలకు రూ.8,600, అలాగే శాటిలైట్ డిష్ కిట్ ధర రూ.34,000గా స్టార్‌లింక్ వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే, తాజాగా ఈ విషయం పై స్టార్‌లింక్ స్పందించింది. సంస్థ ఇంకా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలను అధికారికంగా ప్రకటించలేదని వెల్లడించింది.
వివరాలు
స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్ లైవ్‌లో లేదు
వెబ్‌సైట్‌లో ధరలు కనిపించడాన్ని "కాన్ఫిగరేషన్ గ్లిచ్" (configuration glitch)గా పేర్కొని, అవి కేవలం డమ్మీ డేటా మాత్రమేని స్పష్టం చేసింది. అసలు ధరలు ఇంకా నిర్ణయించబడలేదు అని కూడా తెలిపింది. అందుకే, ప్రభుత్వం ఇచ్చే అనుమతులు పూర్తి అయిన తర్వాతే సేవలు ప్రారంభమవుతాయని సంస్థ క్లారిటీ ఇచ్చింది. స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ (Lauren Dreyer) సోషల్ మీడియా ద్వారా వివరించారు. స్టార్‌లింక్ సేవలు భారత్‌లో ఇంకా ప్రారంభించబడలేదని,కాబట్టి కంపెనీ ప్రస్తుతానికి కస్టమర్ ఆర్డర్లను అంగీకరించడంలేదని స్పష్టం చేశారు. "స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్ లైవ్‌లో లేదు. కస్టమర్లకు సర్వీస్ ధరలను ఇంకా ప్రకటించలేదు. వెబ్‌సైట్‌లో ధరలు కనబడినది కేవలం కాన్ఫిగరేషన్‌లోపం వల్ల,అవి డమ్మీ డేటానే"అని లారెన్ డ్రేయర్ పేర్కొన్నారు.