Loading...
OpenAI GPT-6.2 Astra: ఏఐ మోడల్ రీజనింగ్‌ను దొంగిలించడం ఇక అంత ఈజీ కాదు.. ఓపెన్ ఏఐ కీలక అప్‌గ్రేడ్!
ఏఐ మోడల్ రీజనింగ్‌ను దొంగిలించడం ఇక అంత ఈజీ కాదు.. ఓపెన్ ఏఐ కీలక అప్‌గ్రేడ్!

OpenAI GPT-6.2 Astra: ఏఐ మోడల్ రీజనింగ్‌ను దొంగిలించడం ఇక అంత ఈజీ కాదు.. ఓపెన్ ఏఐ కీలక అప్‌గ్రేడ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల సామర్థ్యాలను అనధికారికంగా వెలికితీసి, వాటిని అనుకరించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు OpenAI తన తాజా మోడల్ GPT-6.2 Astra భద్రతను మరింత పటిష్ఠం చేసింది. ఈ భద్రతా అప్‌గ్రేడ్స్ అమలు చేసిన తర్వాత ఇలాంటి దాడుల్లో విజయవంతమయ్యే ప్రయత్నాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు సంస్థ వెల్లడించింది. గతంలో ఉన్న వెర్షన్‌లో రక్షిత అంతర్గత రీజనింగ్‌ను వెలికితీసేందుకు చేసిన దాడుల్లో సగటున 54 శాతం విజయవంతమయ్యేవి. అయితే GPT-6.2 Astraలో ఈ రేటు కేవలం 0.2 శాతానికి పడిపోయిందని OpenAI తెలిపింది.

వివరాలు

డిస్టిలేషన్ అంటే ఏమిటి? దాని వల్ల ముప్పులేంటి?

ఒక ఏఐ మోడల్ రూపొందించిన డేటా ఆధారంగా మరో మోడల్ నేర్చుకునే మెషిన్ లెర్నింగ్ పద్ధతిని డిస్టిలేషన్ (Distillation) అంటారు.

ఈ విధానానికి సరైన వినియోగాలు ఉన్నప్పటికీ, అనుమతి లేకుండా డిస్టిలేషన్ చేయడం ప్రమాదకరమని OpenAI హెచ్చరించింది.

ఇలా చేస్తే అసలు ఏఐ మోడల్‌లోని అధునాతన సామర్థ్యాలను మరో మోడల్ అనుకరించగలదు.

అయితే, అసలు మోడల్‌లో ఉన్న భద్రతా నియంత్రణలు, రక్షణ వ్యవస్థలు కొత్త మోడల్‌కు తప్పనిసరిగా అందవు.

సైబర్ సెక్యూరిటీ, బయోలాజికల్ రీసెర్చ్ వంటి సున్నితమైన రంగాల్లో ఇది తీవ్రమైన ముప్పులకు దారితీయవచ్చు.

రక్షణ ప్రయోజనాల కోసం అభివృద్ధి చేసిన సామర్థ్యాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

వివరాలు

చైన్ ఆఫ్ థాట్ రీజనింగ్‌కు రక్షణ

ఏఐ మోడల్ ఒక సమాధానానికి చేరుకునే క్రమంలో రూపొందించే మధ్యంతర ఆలోచనా దశలను చైన్ ఆఫ్ థాట్ (Chain-of-Thought) రీజనింగ్ అంటారు.

ఈ సమాచారంపై OpenAI ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎందుకంటే, ఇందులో తుది సమాధానంలో కనిపించని వివరాలు కూడా ఉండవచ్చు.

పోటీ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ సమాచారం విలువైన డేటాగా ఉపయోగపడుతుంది. OpenAI నిర్వహించిన అంతర్గత అధ్యయనంలో మరో విషయం వెల్లడైంది.

సూపర్‌వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ (Supervised Fine-Tuning) తర్వాత, పూర్తి రీజనింగ్ దశల ఆధారంగా శిక్షణ పొందిన ఏఐ మోడళ్లు.. రీజనింగ్ సారాంశాల ఆధారంగా శిక్షణ పొందిన మోడళ్ల కంటే సైబర్ సెక్యూరిటీ బెంచ్‌మార్క్‌లలో మెరుగైన పనితీరు కనబరిచినట్లు గుర్తించారు.

ADVERTISEMENT

వివరాలు

అనధికారిక డిస్టిలేషన్‌ను అడ్డుకునేందుకు చర్యలు

అనుమతి లేని డిస్టిలేషన్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు OpenAI పలు భద్రతా చర్యలు చేపడుతోంది.

మోడల్ స్థాయిలో రక్షణ వ్యవస్థలు, ఇన్‌పుట్, అవుట్‌పుట్ క్లాసిఫైయర్లు, API పరిమితులు అమలు చేస్తోంది.

అంతేకాకుండా సమన్వయంతో జరుగుతున్న డేటా వెలికితీత ప్రయత్నాలపై దర్యాప్తు చేస్తోంది. ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌పై పలు అనధికారిక డిస్టిలేషన్ ప్రచారాలను గుర్తించినట్లు సంస్థ తెలిపింది.

వీటికి సంబంధించి ప్రతి వారం వేల నుంచి పదివేలకుపైగా ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. వేసవి కాలంలో ఇలాంటి కార్యకలాపాల వేగం గణనీయంగా పెరిగిందని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

ఏఐ సంస్థల మధ్య సమన్వయం అవసరం

అనధికారిక డిస్టిలేషన్‌ను అడ్డుకునేందుకు ఇతర ఏఐ మోడల్ ప్రొవైడర్లతోనూ OpenAI కలిసి పనిచేస్తోంది. సైబర్ దాడులకు సంబంధించిన సూచికలను (Indicators of Compromise) ఇతర సంస్థలతో పంచుకుంటోంది.

తద్వారా వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాలను గుర్తించి, అడ్డుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది.

అమెరికా ఏఐ సంస్థలు అభివృద్ధి చేసిన అధునాతన సామర్థ్యాలను విదేశీ సంస్థలు లేదా శక్తులు అనుకరించి, తగిన భద్రతా నియంత్రణలు లేకుండానే వినియోగించే ప్రమాదం ఉందని OpenAI హెచ్చరించింది.

అధునాతన ఏఐ వ్యవస్థలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, కీలక మోడళ్ల సామర్థ్యాలను అనధికారికంగా వెలికితీయకుండా కాపాడేందుకు ఏఐ డెవలపర్లు, డిప్లాయ్‌మెంట్ భాగస్వాములు, ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరమని సంస్థ పిలుపునిచ్చింది.

ADVERTISEMENT