LOADING...
Supercomputers in space: అంతరిక్షంలో ఏఐ డేటా హబ్‌ల కోసం మస్క్‌, బెజోస్‌,పిచాయ్‌ పోటీ.. ముందంజలో చైనా
ముందంజలో చైనా

Supercomputers in space: అంతరిక్షంలో ఏఐ డేటా హబ్‌ల కోసం మస్క్‌, బెజోస్‌,పిచాయ్‌ పోటీ.. ముందంజలో చైనా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోటీ, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది. భూమికి సమీపమైన కక్ష్యలో (లో-ఎర్త్ ఆర్బిట్) ఏఐ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో దేశాల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఈ రంగంలో చైనా ముందంజలో ఉందని అంచనా. త్వరలోనే భూమి పైభాగంలో స్పేస్ సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేసే దిశగా చైనా పని చేస్తోంది. బీజింగ్‌లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటింగ్ టెక్నాలజీ (ICT) శాస్త్రవేత్తలు ఏఐ డేటా సెంటర్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో 10 వేల హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్ కార్డులు ఉంటాయని 'పాపులర్ మెకానిక్స్' నివేదించింది.

వివరాలు 

ఈ పోటీలో ఎన్విడియా మద్దతుతో పనిచేస్తున్న స్టార్ట్‌అప్ ముందుండే అవకాశం 

ఇదే సమయంలో ఎలాన్ మస్క్‌, జెఫ్ బెజోస్‌, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ కూడా ఈ 'కాస్మిక్ ఏఐ హబ్‌ల' అభివృద్ధిలో ఉన్నారు. ఎవరు అత్యుత్తమ అంతరిక్ష ఏఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తారో,వారే భవిష్యత్తులో స్పేస్ కంప్యూటింగ్‌లో ఆధిపత్యం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ పోటీలో ఎన్విడియా మద్దతుతో పనిచేస్తున్న స్టార్ట్‌అప్ 'స్టార్‌క్లౌడ్' ముందుండే అవకాశముంది. ఎన్విడియా హెచ్100 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఉపయోగించిన స్టార్‌క్లౌడ్-1 ఉపగ్రహం గత నెల భూమి వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి చేరింది. ఇందులో 80 జీబీ చిప్‌ను ప్రయోగించడమే కాకుండా,'టెర్రా ఫిర్మా'నుంచి 'నానో జీపిటి' అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌కు శిక్షణ ఇచ్చారు.

వివరాలు 

స్పేస్ ఏఐ డేటా హబ్‌పై పని చేస్తున్న బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ సంస్థ 

ఇప్పటివరకు అంతరిక్షానికి పంపిన ఏ చిప్‌ కంటే ఇది 100 రెట్లు శక్తివంతమైనదిగా చెప్పబడుతోంది. అంతేకాదు, అంతరిక్షంలో శిక్షణ పొందిన తొలి ఏఐ మోడల్‌గా నానో జీపిటి రికార్డు సృష్టించింది. మరోవైపు,బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ సంస్థ గత ఏడాదికిపైగా స్పేస్ ఏఐ డేటా హబ్‌పై పని చేస్తోంది. ఎలాన్ మస్క్‌ తన స్టార్‌లింక్ ఉపగ్రహాలను ఏఐ కంప్యూటింగ్ పనులకు అనుకూలంగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ 'ప్రాజెక్ట్ సన్‌క్యాచర్'ను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపగ్రహాలపై చిన్నచిన్న యంత్రాల ర్యాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. అంతరిక్షంలో ఏఐ మౌలిక సదుపాయాలు ఉంటే, భూమిపై వినియోగించే భారీ విద్యుత్‌, నీటి అవసరం తగ్గుతుంది.

Advertisement

వివరాలు 

భూమి కక్ష్యలో తొలి కంప్యూటింగ్ కానిస్టిలేషన్‌ను ఏర్పాటు చేసిన చైనా 

గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అంతరిక్షంలో ఇవి సౌరశక్తిపై ఆధారపడటం వల్ల, ఏఐ డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ దాదాపు పది రెట్లు తగ్గుతుందని అంచనా. ఈ పోటీలో చైనా ఇప్పటికే చాలా ముందుంది. ఇటీవల భూమి కక్ష్యలో తొలి కంప్యూటింగ్ కానిస్టిలేషన్‌ను ఏర్పాటు చేసింది. గ్వోసింగ్ ఏరోస్పేస్‌, జెజియాంగ్ ల్యాబ్ కలిసి 12 ఉపగ్రహాలను లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపాయి. ఇవి భవిష్యత్తులో తిరుగుతున్న సూపర్ కంప్యూటర్‌కు పునాది కావచ్చని చెబుతున్నారు. ఇప్పటికే 2022లో జోంగ్‌కే టియాన్‌సువాన్ సంస్థ స్పేస్ సూపర్ కంప్యూటర్‌ను ప్రయోగించగా, ఆ ఉపగ్రహం వెయ్యి రోజులకుపైగా స్థిర కక్ష్యలో కొనసాగుతోంది.

Advertisement

వివరాలు 

 2030 నాటికి అంతరిక్షంలో పనిచేసే సూపర్ కంప్యూటర్

దీంతో అంతరిక్ష ఏఐ హబ్‌లు,సూపర్ కంప్యూటర్ల విషయంలో చైనా ఇతర దేశాల కంటే స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. భూమి కక్ష్యలోని ఏఐ డేటా సెంటర్లే భవిష్యత్తు అని స్టార్‌క్లౌడ్ బృందం గతేడాది విడుదల చేసిన వైట్ పేపర్‌లో పేర్కొంది. "గిగావాట్ స్థాయి ఆర్బిటల్ డేటా సెంటర్లు చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రాజెక్టుల్లో ఒకటి.ఇవి సాధ్యమే కాకుండా ఆర్థికంగా లాభదాయకమైనవని,21వశతాబ్దంలోని అత్యంత ముఖ్యమైన సాంకేతికత అయిన ఏఐ పూర్తి సామర్థ్యాన్ని వేగంగా,స్థిరంగా వినియోగించేందుకు అవసరమని మేము నమ్ముతున్నాం"అని ఆ పత్రంలో స్పష్టం చేసింది. నిపుణుల అంచనాల ప్రకారం 2030 నాటికి నిజమైన సూపర్ కంప్యూటర్ అంతరిక్షంలో పనిచేసే అవకాశం ఉంది. అయితే,అందరికంటే ముందుగా ఎవరు దీనిని ప్రారంభిస్తారో చూడాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement