Embryo Editing: హై ఇంటెలిజెన్స్‌తో బేబీలు? జీన్ ఎడిటింగ్ కొత్త ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఒక స్టార్టప్ కంపెనీ జీన్ల మార్పిడి (Gene Editing) టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఈ సంస్థ డిజైనర్ బేబీలు సృష్టించుకోవడం లక్ష్యంగా ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సిలికాన్ వ్యాలీలోని పలువురు బిలియనీర్లు ఆర్థిక సహాయం అందిస్తున్నారని సమాచారం. ఎంబ్రియో ఎడిటింగ్ (Embryo Editing) ద్వారా గర్భస్థ శిశువులోనే జన్యుక్రమాన్ని మార్చి, వంశపారంపర్య వ్యాధులు లేని, అధిక మేధస్సు కలిగిన శిశువుల్ని రూపొందించాలనే యత్నం జరుగుతోంది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ప్రత్యేక కథనంలో ప్రస్తావించింది.
వివరాలు
ఈ సంస్థను ప్రారంభించిన జీన్ ఎడిటింగ్ శాస్త్రవేత్త లూకాస్ హారింగ్టన్
ఇప్పటికే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వైద్యరంగంలో ఉంది. అయితే ప్రస్తుతం దాన్ని ఎక్కువగా పుట్టిన తరువాత వచ్చే వ్యాధుల చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. కానీ సాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రివెంటిన్ (Preventin) అనే స్టార్టప్ మాత్రం పుట్టుకకు ముందే జన్యు మార్పులు చేయడం మీద పరిశోధన చేస్తోంది. జీన్ ఎడిటింగ్ శాస్త్రవేత్త లూకాస్ హారింగ్టన్ ఈ సంస్థను ప్రారంభించారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, కాయిన్‌బేస్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ వంటి ప్రముఖులు ఈ పరిశోధనకు మద్దతు అందిస్తున్నారు.
వివరాలు
ప్రక్రియ కోసం సుమారు 3 లక్షల డాలర్లు వ్యయం
గర్భ స్థితిలోనే జన్యు మార్పులు చేయడం ద్వారా, తరం నుంచి తరానికి వచ్చే రోగాలను నివారించడం సంస్థ లక్ష్యంగా ప్రకటించింది. డిజైనర్ బేబీలు అనే అంశం బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఎంబ్రియో ఎడిటింగ్‌కు అనుమతి ఇచ్చే దేశం/ప్రాంతం కోసం సంస్థ ప్రస్తుతం వెతుకుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ ప్రక్రియ కోసం సుమారు 3 లక్షల డాలర్లు వ్యయం అవుతుందని చెబుతున్నారు. జీన్ల మార్పిడి ద్వారా పుట్టిన శిశువులు బలహీనతలు తక్కువగా, ఆరోగ్యంగా ఉంటారని క్రిప్టోకరెన్సీ బిలియనీర్ ఆర్మ్‌స్ట్రాంగ్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన, శాస్త్రీయంగా రూపొందించిన శిశువులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆ కథనంలో పేర్కొంది.