Landline-like phone: స్క్రీన్ టైమ్ తగ్గించాలనే ఆలోచనతో..ల్యాండ్‌లైన్ స్టైల్ ఫోన్‌తో మూడు రోజుల్లో రూ.1కోటి బిజినెస్..టెక్ మహిళ సక్సెస్ స్టోరీ !
ఈ వార్తాకథనం ఏంటి
స్క్రీన్ టైమ్ తగ్గించాలనే ఆలోచనతో ఓ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకురాలు రూపొందించిన పాత ల్యాండ్‌లైన్ ఫోన్ స్టైల్ డివైస్ ఇప్పుడు వైరల్ బిజినెస్‌గా మారింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రూ.1 కోట్లకు పైగా అమ్మకాలు సాధించింది. సోషల్ మీడియాలో CatGPTగా ప్రసిద్ధి చెందిన క్యాట్ గోయెట్జ్ రెండేళ్ల క్రితం తన స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా తక్కువ టెక్నాలజీతో పనిచేసే ఏదైనా కావాలని భావించింది. చిన్నప్పుడు ఉపయోగించిన ల్యాండ్‌లైన్ ఫోన్లపై నాస్టాల్జియాతో ఓ పాత ఫోన్ కొనుగోలు చేసి, దాన్ని హ్యాక్ చేసి బ్లూటూత్ సపోర్ట్‌తో పనిచేసేలా మార్చింది. "మన దృష్టి కాలం తగ్గిపోతోంది. ఆందోళనలు పెరుగుతున్నాయి. ఒంటరితనం ఎక్కువవుతోంది" అంటూ స్క్రీన్ టైమ్ తగ్గించాలనే ఆలోచన ఇప్పుడు చాలామందిలో పెరుగుతోందని ఆమె చెబుతోంది.
వివరాలు
వాయిస్ అసిస్టెంట్ కోసం బటన్
ఈ 'ఫిజికల్ ఫోన్' బ్లూటూత్ ద్వారా ఐఫోన్,ఆండ్రాయిడ్‌లకు కనెక్ట్ అయి వాట్సాప్,ఫేస్‌టైమ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్ నుంచి వచ్చే కాల్స్‌ను నేరుగా ఫోన్‌లో వినిపిస్తుంది. నంబర్లు డయల్ చేయడంతో పాటు వాయిస్ అసిస్టెంట్ కోసం బటన్ కూడా ఉంది. 2025 జులైలో ఈ డివైస్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఆమెకు మొదట 15-20ప్రీ ఆర్డర్లు వస్తాయని అంచనా వేసినా,అనూహ్యంగా వందలాది ఆర్డర్లు వచ్చాయి. మూడు రోజుల్లోనే రూ.1 కోటి అమ్మకాలు దాటి, అక్టోబర్ నాటికి మొత్తం టర్నోవర్ రూ.2.5 కోట్లకు చేరింది. ఇప్పటివరకు 3,000కు పైగా ఫోన్లు అమ్ముడయ్యాయి.ఒక్కో ఫోన్ ధర రూ.8,000 నుంచి రూ.9,800 వరకు ఉంది. తయారీ సంస్థతో భాగస్వామ్యంగా పని చేస్తున్న గోయెట్జ్,తొలి బ్యాచ్ డెలివరీలను డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు.