Loading...
Telegram: ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాయమైన టెలిగ్రామ్.. తిరిగి సేవలు పునరుద్ధరణ
ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాయమైన టెలిగ్రామ్.. తిరిగి సేవలు పునరుద్ధరణ

Telegram: ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాయమైన టెలిగ్రామ్.. తిరిగి సేవలు పునరుద్ధరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మరోసారి వివాదాల్లో నిలిచింది. పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన (Child Sexual Abuse Material - CSAM) కంటెంట్ గుర్తించిన నేపథ్యంలో ఆపిల్ కొన్ని దేశాల్లో తన యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా తొలగించింది. అయితే, సంబంధిత కంటెంట్‌ను టెలిగ్రామ్ వెంటనే తొలగించి, దాన్ని పోస్ట్ చేసిన ఖాతాపై చర్యలు తీసుకోవడంతో యాప్‌ను తిరిగి యాప్ స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం పలు దేశాల్లోని ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులు యాప్ స్టోర్‌లో టెలిగ్రామ్ కోసం వెతికినప్పుడు అది కనిపించలేదు. అయితే, ఈ చర్య ప్రభావం భారత్‌పై పడలేదు.భారత వినియోగదారులు యథావిధిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కొనసాగింది.

వివరాలు 

చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ గుర్తించడంతో తాత్కాలికంగా తొలగించిన ఆపిల్

అలాగే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, మ్యాక్ యాప్ స్టోర్‌లలో కూడా టెలిగ్రామ్ అందుబాటులోనే ఉంది. ఇప్పటికే యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి సేవల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు.

ఈ వ్యవహారంపై ఆపిల్ వివరణను బ్లూమ్‌బర్గ్ టెక్నాలజీ జర్నలిస్టు మార్క్ గుర్మాన్ వెల్లడించారు.

యాప్ స్టోర్ మార్గదర్శకాలను ఉల్లంఘించే చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ గుర్తించడంతో టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా తొలగించినట్లు ఆపిల్ తెలిపింది.

అనంతరం టెలిగ్రామ్ ఆ కంటెంట్‌ను తొలగించడమే కాకుండా, దాన్ని అప్‌లోడ్ చేసిన వినియోగదారుడి ఖాతాను నిషేధించడంతో యాప్‌ను మళ్లీ పునరుద్ధరించినట్లు వివరించింది.

వివరాలు 

సైబర్ నేరాలు, అక్రమ కార్యకలాపాలకు వేదికగా టెలిగ్రామ్

టెలిగ్రామ్‌పై ఆపిల్ చర్య తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2018లో కూడా అనుచిత కంటెంట్ వ్యాప్తి ఆరోపణల నేపథ్యంలో యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా తొలగించింది.

అలాగే బ్రెజిల్, చైనా వంటి దేశాలు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో టెలిగ్రామ్ సేవలపై ఆంక్షలు విధించాయి.

మరోవైపు, భారత్‌లోనూ టెలిగ్రామ్‌పై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం తర్వాత ఈ యాప్ వినియోగంపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి.

సైబర్ నేరాలు, అక్రమ కార్యకలాపాలకు టెలిగ్రామ్ వేదికగా మారుతోందని, ఇది "కొత్త డార్క్ వెబ్"లా మారిందని ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.

ADVERTISEMENT