Page Loader
Telegram: ఇండియాలో టెలిగ్రామ్ యాప్ నిషేధిస్తారా ? విచారణ ప్రారంభించిన కేంద్రం 
ఇండియాలో టెలిగ్రామ్ యాప్ నిషేధిస్తారా ? విచారణ ప్రారంభించిన కేంద్రం

Telegram: ఇండియాలో టెలిగ్రామ్ యాప్ నిషేధిస్తారా ? విచారణ ప్రారంభించిన కేంద్రం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2024
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు పావెల్‌ దురోవ్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, టెలిగ్రామ్‌ యాప్‌ నిర్వహణపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని సమాచారం. ఈ యాప్‌ మోసాలు, జూదం వంటి క్రిమినల్‌ కార్యకలాపాలకు ఉపయోగపడుతోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్‌ కోఆర్డినేషన్ సెంటర్‌ టెలిగ్రామ్‌ ఐటీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నదా అనే అంశంపై దర్యాప్తు మొదలుపెట్టింది.

వివరాలు 

ఫ్రాన్స్‌లో అరెస్ట్ అయ్యిన దురోవ్‌ 

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం స్పష్టమైనట్లయితే, టెలిగ్రామ్‌ను భారత్‌లో బ్యాన్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో టెలిగ్రామ్‌కు 50 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. దీంతో, ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేమని ఓ అధికారి పేర్కొన్నారు. దర్యాప్తు ఫలితాలపై ఆధారపడి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్, ఉగ్రవాదం, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణల నేపథ్యంలో పావెల్‌ దురోవ్‌ అరెస్ట్‌ కావడం, మూడు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దురోవ్‌ను ఫ్రాన్స్‌లోని పారిస్ సమీపంలోని ఓ విమానాశ్రయంలో ఫ్రెంచ్‌ అధికారులు అరెస్ట్ చేశారు.