Tesla Cyber cab: డ్రైవర్ అవసరం లేని కారు.. సైబర్‌క్యాబ్‌ను లాంచ్ చేసిన టెస్లా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'టెస్లా' అటానమస్ రోబోట్యాక్సీ సేవల దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా రూపొందించిన ప్రత్యేక రోబోట్యాక్సీ 'సైబర్ క్యాబ్' ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ వాహనం ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 38 సెకన్ల ప్రమోషనల్ వీడియోను కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ విడుదల చేశారు. ఆ వీడియోలో డ్రైవర్ అవసరం లేకుండా సైబర్ క్యాబ్ స్వయంగా ఎలా రోడ్లపై ప్రయాణిస్తుందో చూపించారు. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన వాహనం పూర్తిగా ఆటోనమస్‌గా కదులుతున్న దృశ్యాలు ఇందులో కనిపించాయి.
వివరాలు
ప్రయాణికులను గమ్యస్థానాలను తీసుకెళ్తుంది
ఈ సైబర్ క్యాబ్ ఉత్పత్తిని అమెరికాలోని గిగా టెక్సాస్ ప్లాంట్‌లో చేపడుతున్నారు. టెస్లా వెబ్‌సైట్ ప్రకారం, వినియోగదారులు రోబోట్యాక్సీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రైడ్ బుక్ చేస్తే, వాహనం నేరుగా ఇంటి ముందుకే వచ్చి ఆగుతుంది. ప్రయాణికులు ఎక్కిన వెంటనే అది గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో మోడల్ వై ఆధారంగా ఎర్లీ యాక్సెస్ రోబోట్యాక్సీ సేవలను అందిస్తున్న టెస్లా, త్వరలో మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. 2024లో సైబర్ క్యాబ్‌ను పరిచయం చేసిన సంస్థ, ఇప్పుడు దాని ఉత్పత్తిని ప్రారంభించి ట్యాక్సీ రంగంలో పెద్ద మార్పులకు దారితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది.