Jacob Coxon: ఏఐ రేసు హద్దులు దాటింది.. మనుషుల భద్రతపై ఆంథ్రోపిక్ పరిశోధకుడి ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐ రంగంలోని దిగ్గజ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా సూపర్‌ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం పోటీ పడుతున్నాయని ఆంత్రోపిక్ మాజీ ఏఐ పరిశోధకుడు జాకబ్ కోక్సన్ ఆరోపించారు. ఓపెన్‌ఏఐ సహా ప్రముఖ ఏఐ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు చివరకు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఆంత్రోపిక్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాకబ్ కోక్సన్ గత మూడేళ్లలో ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థల్లో ప్రీ-ట్రెయినింగ్ పరిశోధనలో పనిచేశారు. రాజీనామా చేసిన విషయాన్ని సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడిస్తూ.. ఈ రెండు సంస్థల్లోనూ తాను పనిచేశానని తెలిపారు. అయితే ఏఐ ల్యాబ్‌ల మధ్య నెలకొన్న పోటీ ప్రస్తుతం హద్దులు దాటిపోయిందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఏదైనా హ్యాక్ చేసే స్థాయిలో..
స్వయంగా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే సూపర్‌ఇంటెలిజెన్స్ వ్యవస్థల అభివృద్ధి కోసం కంపెనీలు పరుగులు తీస్తున్నాయని పేర్కొన్నారు.
ఏదైనా వ్యవస్థను హ్యాక్ చేయగల సామర్థ్యం ఉన్న సూపర్‌హ్యూమన్ ఏఐ వ్యవస్థల వైపు సాంకేతికత వేగంగా అడుగులు వేస్తోందని కోక్సన్ అన్నారు.
ఈ స్థాయి సాంకేతికత అందుబాటులోకి వస్తే.. రాత్రికి రాత్రే అనేక రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అంతేకాకుండా మానవ శక్తి, వనరులపై కూడా ఏఐ వ్యవస్థలు భారీగా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
ఇదే ఆందోళన వ్యక్తం చేసిన ఓపెన్‌ఏఐ శాస్త్రవేత్త
ఇతర మానవ కార్యకలాపాలతో పోలిస్తే ఏఐ సృష్టించే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండొచ్చని కోక్సన్ తన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.
ఇటీవల చోటుచేసుకున్న హగ్గింగ్ ఫేస్ హ్యాకింగ్ ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు.
ఏఐ వ్యవస్థల సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి భద్రత, నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఏఐ అభివృద్ధి వేగంపై ఆందోళన వ్యక్తం చేసిన వారిలో కోక్సన్ ఒక్కరే కాదు.
ఇటీవల ఓపెన్‌ఏఐ ముఖ్య శాస్త్రవేత్త జాకుబ్ పకోచి కూడా ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐ భద్రతకు సంబంధించి తగిన ప్రమాణాలు ఏర్పడే వరకు సంస్థలు తమ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
వివరాలు
సూపర్‌ఇంటెలిజెన్స్‌పై ఆంత్రోపిక్ వివరణ
మరోవైపు ఆంథ్రోపిక్ ప్రస్తుతం అలైన్‌మెంట్ సైన్స్ లీడ్‌గా ఉన్న ఎవాన్ హబింగర్.. సూపర్‌ఇంటెలిజెన్స్ దిశగా వెళ్లాలనే ఆలోచన తమ కంపెనీకి లేదని స్పష్టం చేశారు.
దీంతో ఏఐ సంస్థల భవిష్యత్ లక్ష్యాలు, సాంకేతిక అభివృద్ధి వేగం, భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది.