CNAP: సర్కారు వారి ట్రూ కాలర్ వచ్చేస్తోంది.. సైబర్ నేరాలకు బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
మొబైల్ ఫోన్లు కొత్తగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు, ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కష్టంగానే ఉండేది. ఆ తరువాత కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిలో ప్రధానమైనది 'ట్రూ కాలర్'. ఈ యాప్ ద్వారా, ఎక్కువ మంది ఏ నెంబర్‌ని ఏ పేరుతో సేవ్ చేస్తారో ఆ పేరు మీ స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు కొత్తగా జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు కూడా ఇన్-బిల్ట్ కాలర్ ఐడి ఫీచర్ అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఫీచర్ ద్వారా, ఫోన్ అందుతున్న వ్యక్తి కోరుకున్న పేరుతోనే కాలర్ ఐడి స్క్రీన్‌లో చూపిస్తుంది.
Details
రకరకాల నెంబర్లతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
అంతేకాదు సామ్‌సంగ్ వంటి మొబైల్ తయారీ కంపెనీలు ఫోన్లోనే అధిక సౌకర్యంతో ఈ కాలర్ ఐడి ఫెసిలిటీస్ అందించడంలో ముందున్నారు. కానీ, వీటిలో కూడా 100% నిజమైన (జన్యునిటీ) కాలర్ ఐడి సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితులను ఉపయోగించి సైబర్ క్రైమ్ నేరగాళ్లు రకరకాల ఫోన్ నంబర్లతో ఫోన్లు చేసి, మోసపూర్ణమైన పద్ధతిలో మనల్ని మోసం చేస్తున్నారు. ట్రూ కాలర్‌లో పోలీస్ స్టేషన్లు, ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ కార్యాలయాలు, డిజిటల్ అరెస్ట్, సిబిఐ, సిఐడి వంటి పేర్లతో రిజిస్టర్ చేసుకుని, ఆ నంబర్ ద్వారా కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా ట్రూ కాలర్‌లో వెరిఫైడ్ నేమ్ కనిపిస్తుండటంతో సులభంగా నమ్మేస్తున్నారు.
Details
నూతన ఐడియాతో ముందుకొచ్చిన కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ
కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, పరిస్థితి కాస్త కష్టం అవుతోంది. అందుకే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. 2026 మార్చి నుండి సిమ్ కార్డ్ కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే ఆధార్ కార్డు లోని పేరు, ఆ నెంబర్‌కి బదులుగా స్క్రీన్‌లో డిస్ప్లే అవుతుంది. దీనికి CNAP (Calling Name Presentation) అని పేరు పెట్టారు. ఇప్పటికే, అన్ని టెలికాం ఆపరేటర్లకు అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Details
ఆటోమేటిక్‌గా అన్ని మొబైల్స్‌లో అప్డేట్
2026 మార్చి తరువాత, ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా అన్ని మొబైల్స్‌లో అప్డేట్ అవుతుంది. అందువల్ల, ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేది నెంబర్ కాకుండా పేరు రూపంలో స్క్రీన్‌లో కనిపిస్తుంది. దీని ద్వారా సైబర్ క్రైమ్ నియంత్రణ, మొబైల్ యూజర్లకు మరింత ప్రైవసీ అందించడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాక, ఎవరైనా కోరుకుంటే, వారి పేరు కాకుండా నెంబర్ మాత్రమే స్క్రీన్‌లో కనిపించేలా ఈ ఫీచర్ ఆఫ్ చేయగల ఫెసిలిటీ కూడా కేంద్రం కల్పిస్తుంది.