LOADING...
iPhone effect: పిల్లలు పుట్టకపోవడానికి స్మార్ట్‌ఫోన్లే కారణమా? కొత్త అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు!
కొత్త పరిశోధనలో ఆసక్తికర నిజాలు

iPhone effect: పిల్లలు పుట్టకపోవడానికి స్మార్ట్‌ఫోన్లే కారణమా? కొత్త అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోవడం 21వ శతాబ్దంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా మారింది. అమెరికా, యూరప్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, భారత్ వంటి దేశాలు జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరగడం, శ్రామిక శక్తి క్షీణించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు జీవన వ్యయం పెరగడం, ఖరీదైన ఇళ్లు, ఆలస్య వివాహాలు, మారుతున్న సామాజిక పరిస్థితులే దీనికి ప్రధాన కారణాలుగా భావించేవారు. అయితే తాజాగా వెలువడిన రెండు అధ్యయనాలు మరో ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చాయి. స్మార్ట్‌ఫోన్ల విస్తరణ కూడా జననాల రేటు తగ్గుదలకు పరోక్షంగా కారణమై ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

వివరాలు 

ఐఫోన్‌ ఎక్కువగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు మరింత వేగంగా తగ్గింది

అమెరికాలో 2007లో తొలి ఐఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత జననాల రేటులో వచ్చిన మార్పులను ఒక అధ్యయనం విశ్లేషించింది. పరిశోధకులు కైట్లిన్ మైయర్స్, ఎజెకియెల్ హూపర్‌లు అప్పట్లో ఐఫోన్‌ కేవలం AT&T నెట్‌వర్క్‌లో మాత్రమే అందుబాటులో ఉండటాన్ని ఆధారంగా తీసుకుని, మెరుగైన నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాలు, పరిమిత సేవలు ఉన్న ప్రాంతాల మధ్య పోలికలు చేశారు. ఈ అధ్యయనంలో ఐఫోన్‌ ఎక్కువగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు మరింత వేగంగా తగ్గినట్లు గుర్తించారు. ముఖ్యంగా 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న యువతుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించగా, ఇతర వయసు వర్గాల్లోనూ కొంత మేర తగ్గుదల నమోదైంది.

వివరాలు 

ఈ మార్పులు సంతానోత్పత్తి నిర్ణయాలపై పరోక్ష ప్రభావం చూపిస్తున్నాయి 

అయితే స్మార్ట్‌ఫోన్లే నేరుగా పిల్లలు పుట్టకుండా చేస్తున్నాయని పరిశోధకులు చెప్పడం లేదు. కానీ, స్మార్ట్‌ఫోన్ల వల్ల మనుషుల జీవనశైలి, సామాజిక సంబంధాలు, డేటింగ్ విధానాలు, వ్యక్తిగత పరిచయాలు మారిపోయాయని, ఈ మార్పులు సంతానోత్పత్తి నిర్ణయాలపై పరోక్ష ప్రభావం చూపి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు దైనందిన జీవితంలో కీలక భాగంగా మారిన తర్వాత ప్రత్యక్షంగా కలుసుకోవడం తగ్గడం, యువతలో లైంగిక సంబంధాలు తగ్గిపోవడం, అదే సమయంలో డిజిటల్ వినోదం, సోషల్ మీడియా, ఆన్‌లైన్ కంటెంట్ వినియోగం భారీగా పెరగడం వంటి మార్పులు చోటుచేసుకున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇవన్నీ జననాల రేటు తగ్గుదలకు ఒక కారణంగా ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

వివరాలు 

స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. జననాల రేటు మరింత వేగంగా పడిపోయింది

ఇదే అంశంపై ఈ ఏడాది వెలువడిన మరో అధ్యయనం అమెరికాతో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల డేటాను పరిశీలించింది. ఆర్థికవేత్తలు నాథన్ హడ్సన్,హెర్నాన్ మోస్కోసో బోయెడో ప్రపంచ బ్యాంకు గణాంకాలతో స్మార్ట్‌ఫోన్ వినియోగం,టీనేజ్ జననాల రేట్లను పోల్చి చూశారు. వారి విశ్లేషణలో స్మార్ట్‌ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక దేశాల్లో జననాల రేటు మరింత వేగంగా పడిపోయినట్లు తేలింది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు,ఆరోగ్య వ్యవస్థలు,సంక్షేమ పథకాలు, సంస్కృతి పరంగా పూర్తిగా భిన్నమైన దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిశోధకులు స్మార్ట్‌ఫోన్లను ఒక "ప్రపంచ సాంకేతిక విప్లవ ప్రభావం"గా అభివర్ణిస్తున్నారు. ఒకే సాంకేతిక ఆవిష్కరణ ప్రపంచ జనాభా ధోరణులను ప్రభావితం చేస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వివరాలు 

అమెరికా రికార్డు స్థాయిలో పడిపోయిన జననాల రేటు

అయితే ఈ వాదనతో అందరూ ఏకీభవించడం లేదు. స్మార్ట్‌ఫోన్లు రాకముందే జననాల రేటు తగ్గుదల ప్రారంభమైందని కొందరు నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు అమెరికాలో టీనేజ్ గర్భధారణలు, జననాలు 1990ల నుంచే తగ్గుతున్నాయని వారు చెబుతున్నారు. అందువల్ల స్మార్ట్‌ఫోన్లనే ప్రధాన కారణంగా చూడడం సరైంది కాదని,ఆర్థిక,సామాజిక,సాంస్కృతిక అంశాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ అధ్యయనాలు ప్రభుత్వాలకు కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. అమెరికాలో జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోగా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కుటుంబాలను ప్రోత్సహించే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. చైనా కూడా దశాబ్దం క్రితమే'ఒక కుటుంబానికి ఒకే బిడ్డ'విధానాన్ని ఎత్తివేసినప్పటికీ, అక్కడ జననాల సంఖ్య తగ్గుతూనే ఉంది.

వివరాలు 

స్మార్ట్‌ఫోన్ ప్రభావంపై మరిన్ని అధ్యయనాలు జరిగే అవకాశాలు

జనాభా తగ్గుదలకు స్మార్ట్‌ఫోన్లే ఏకైక కారణం కాకపోయినా, మనుషుల మధ్య సంబంధాలు, జీవనశైలి, కుటుంబ నిర్మాణంపై వాటి ప్రభావం ఎంత మేర ఉందో తెలుసుకోవడం భవిష్యత్తులో కీలకంగా మారనుంది. ప్రపంచ దేశాలు జనాభా సంక్షోభానికి పరిష్కారాలు వెతుకుతున్న ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ ప్రభావంపై మరిన్ని అధ్యయనాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement