LOADING...
NASA: అంగారక గ్రహంలో అత్యంత పురాతన ప్రాంతం గుర్తింపు.. 'క్రొకడైల్ బ్రిడ్జ్'పై నాసా ఫోకస్
అంగారక గ్రహంలో అత్యంత పురాతన ప్రాంతం గుర్తింపు.. 'క్రొకడైల్ బ్రిడ్జ్'పై నాసా ఫోకస్

NASA: అంగారక గ్రహంలో అత్యంత పురాతన ప్రాంతం గుర్తింపు.. 'క్రొకడైల్ బ్రిడ్జ్'పై నాసా ఫోకస్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ తాజాగా అంగారక గ్రహంపై ఉన్న అత్యంత పురాతన ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న 'క్రొకడైల్ బ్రిడ్జ్' ప్రాంతానికి సంబంధించిన అద్భుతమైన 360 డిగ్రీల పానోరమిక్ దృశ్యాలను చిత్రీకరించింది. Mastcam-Z కెమెరా వ్యవస్థతో ఈ చిత్రాలను సేకరించినట్లు నాసా వెల్లడించింది. ఈ దృశ్యాలు అంగారక గ్రహపు ఆది చరిత్రపై కీలక సమాచారం అందించే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పానోరమిక్ చిత్రాన్ని మొత్తం 980 ఫొటోలతో రూపొందించారు. వీటిలో 971 చిత్రాలను 2025 డిసెంబర్ 18న తీసుకోగా, మిగతా తొమ్మిది చిత్రాలను 2026 జనవరి 25న సేకరించారు. అనంతరం ఈ చిత్రాలను సహజ రంగుల్లో ప్రాసెస్ చేసి, మానవ కంటికి కనిపించే విధంగా నాసా విడుదల చేసింది.

వివరాలు

'క్రొకడైల్ బ్రిడ్జ్' అంటే ఏమిటి?

"క్రొకడైల్ బ్రిడ్జ్" ప్రాంతం జెజెరో బిలం అడుగు భాగం, దాని అంచు మధ్య ఉన్న కీలక భౌగోళిక ప్రాంతంగా గుర్తించబడింది. ఇక్కడి రాళ్లు అంగారక గ్రహంలోని అత్యంత పురాతన శిలలలో ఒకటిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి 3.7 బిలియన్ సంవత్సరాలకు పైబడిన నోయాషియన్ కాలానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు. అంటే జెజెరో క్రేటర్‌లో నీరు నిండకముందు, ఆ క్రేటర్ ఏర్పడకముందు కాలానికి చెందిన అవశేషాలుగా వీటిని పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలోని శిలలను 'రెడ్ ప్లానెట్' ప్రారంభ చరిత్రను దాచుకున్న టైమ్ క్యాప్సూల్స్‌గా నాసా అభివర్ణించింది. అంగారక గ్రహపు ఉపరితలం, వాతావరణం ఎలా రూపుదిద్దుకున్నాయో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది.

వివరాలు

భూమిపై లేని ప్రత్యేకత

భూమిపై టెక్టానిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉపరితలాన్ని మారుస్తుంటాయి. అందువల్ల ఇంత పురాతన భూభాగాలు భూమిపై కనిపించవు. కానీ అంగారక గ్రహంపై అలాంటి టెక్టానిక్ వ్యవస్థలు లేకపోవడంతో ఈ పురాతన శిలలు కోట్ల సంవత్సరాలుగా అలాగే సంరక్షితంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 'క్రొకడైల్ బ్రిడ్జ్' ప్రాంతం ఒక వంకర ఆకారంలో ఉన్న గట్టి రాతి నిర్మాణం. ఇది మొసలి వీపు ఆకారాన్ని పోలి ఉండటంతో ఈ పేరు పెట్టారు. ఈ ప్రాంతం నుంచి రోవర్ త్వరలో "లాక్ డి చార్మ్స్"గా పిలిచే మరో ప్రాంతంలోకి ప్రవేశించనుంది. అక్కడ కూడా పలు నెలలపాటు పరిశోధనలు కొనసాగించనుంది.

Advertisement

వివరాలు

ఆసక్తిగా ఎదురుచూస్తున్న శస్త్రవేత్తలు

జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ నిర్వహిస్తున్న పెర్సివీరెన్స్ రోవర్, మార్స్ 2020 మిషన్‌లో భాగంగా పనిచేస్తోంది. అంగారక గ్రహం గతంలో జీవానికి అనుకూల పరిస్థితులు కలిగి ఉందా? అక్కడ జీవం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? అనే అంశాలపై ఈ రోవర్ పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇక 'క్రొకడైల్ బ్రిడ్జ్' ప్రాంతం అంగారక గ్రహం ఆవిర్భావ చరిత్రకు సంబంధించిన కీలక రహస్యాలను బయటపెడుతుందేమోనని శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement