Loading...
Sanjana Tripuramallu: అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారతీయ వజ్రం
అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారతీయ వజ్రం

Sanjana Tripuramallu: అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారతీయ వజ్రం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షంలో పంటలు పండించగలమా అనే లక్ష్యంతో విత్తనాలను, కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే సామర్థ్యం ఉన్న మైక్రోఆల్గేను, మైక్రోగ్రావిటీతో పాటు రేడియేషన్ ప్రభావాలను అధ్యయనం చేయడానికి డీఎన్‌ఏ నమూనాలను ఇప్పటికే అంతరిక్షానికి పంపించారు. ఇప్పుడు అదే జాబితాలో మరో ప్రత్యేక ప్రయోగం చేరుతోంది. "స్పేస్ ఫర్ ఆల్" అనే ఆలోచనతో తొలిసారిగా ల్యాబ్‌లో తయారైన వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమయ్యారు. ఈ వినూత్న వజ్రాన్ని రూపొందించింది తెలుగు యువ డిజైనర్ సంజనా త్రిపురమల్లు. ఈ అరుదైన అవకాశాన్ని ఎలా అందుకున్నారో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.

వివరాలు

తెనాలి నుంచి డిజైన్ ప్రపంచం వరకు..

సంజనా స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి. తండ్రి శేఖర్, తల్లి గిరిజ. వీరిది వ్యాపార కుటుంబం. తల్లి బంగారు ఆభరణాల తయారీ, విక్రయ రంగంలో ఉండటంతో చిన్నప్పటి నుంచే ఆభరణాల రూపకల్పనపై సంజనకు ఆసక్తి పెరిగింది.

అయితే ఆ ఆసక్తిని వృత్తిగా మార్చుకోవాలనే ఆలోచన అప్పట్లో రాలేదు. అందుకే ముందుగా ఇంజినీరింగ్ చదివారు.

బీటెక్ పూర్తి చేసిన తర్వాత మాత్రం తనకు సృజనాత్మక రంగమే సరైనదని భావించారు.

దీంతో గుజరాత్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)లో ప్రవేశం పొంది స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశారు.

అనంతరం శామ్‌సంగ్ బెంగళూరు కార్యాలయంలో ఉద్యోగం పొందారు.

వివరాలు

జీవిత భాగస్వామి పరిచయమే కొత్త దిశ..

ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఇంట్లో వివాహ సంబంధాలు చూడటం ప్రారంభించారు.

ఆ సమయంలోనే రిషికేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రముఖ స్టార్టప్ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు. ఎలాంటి నేపథ్యం లేకుండా సొంతంగా వ్యాపారాన్ని నిర్మించిన ఆయన ప్రయాణం సంజనకు ఎంతో ప్రేరణనిచ్చింది.

అదే ప్రభావంతో తానూ వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

వివాహ ఏర్పాట్లలో భాగంగా నిశ్చితార్థం కోసం వజ్రపు ఉంగరం కొనుగోలు చేయడానికి బెంగళూరులోని అనేక దుకాణాలు తిరిగారు.

అయితే ధర, నాణ్యత, విశ్వసనీయత విషయంలో సరైన సమతుల్యత కనిపించలేదు. ఈ అన్వేషణలోనే ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ గురించి తెలుసుకున్నారు.

చివరికి తన నిశ్చితార్థానికి ధరించిన వజ్రపు ఉంగరాన్ని స్వయంగా రూపొందించుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

'కాస్మోస్ డైమండ్స్' అనే సంస్థ ప్రారంభం..

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో స్నేహితులు కూడా తమ కోసం అలాంటి ఆభరణాలు తయారు చేయమని కోరారు. అక్కడి నుంచే వ్యాపార ఆలోచన రూపుదిద్దుకుంది.

ఫలితంగా 2020లో 'కాస్మోస్ డైమండ్స్' అనే సంస్థను ప్రారంభించారు. వ్యాపారం మొదటి దశలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

యంత్రాల కొనుగోలు, ముడిసరుకు ఎంపిక, నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకం వంటి అంశాల్లో ఎన్నో తప్పిదాలు జరిగాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు.

వ్యాపార అవసరాల కోసం వివిధ సంస్థలకు వెళ్లినప్పుడు "మీతో పురుషులు ఎవరూ రాలేదా?" అనే ప్రశ్నలు తరచూ ఎదురయ్యేవి.

అప్పుడు ఈ రంగంలో మహిళల కంటే పురుషుల ఆధిపత్యం ఎంత ఎక్కువగా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు ఆమె చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

అనుకోకుండా దక్కిన అంతరిక్ష అవకాశం..

వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో సంజనా ఒక బిజినెస్ క్లబ్‌లో సభ్యత్వం తీసుకున్నారు.

అదే క్లబ్‌లో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు కూడా ఉండేవారు.

"కాస్మోస్" అనే పేరు చూసి అది అంతరిక్ష రంగానికి సంబంధించిన సంస్థేనని భావించి ముందుగా ఆయనే సంభాషణ ప్రారంభించారు.

అప్పుడు సంజనా తమది ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ తయారీ సంస్థ అని వివరించారు.

ప్రయోగాల కోసం ఇప్పటికే ఎన్నో వస్తువులను అంతరిక్షానికి పంపుతున్నారని, ఒక వజ్రాన్ని కూడా పంపే అవకాశం ఉందా అని ప్రశ్నించారు.

అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ, "ఎందుకు కాదు... తయారు చేసి ఇవ్వండి, తప్పకుండా పంపిస్తాం" అని హామీ ఇచ్చారు. అలా ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఈ అరుదైన అవకాశం లభించింది.

ADVERTISEMENT