Loading...
Lilian Weng: థింకింగ్ మెషీన్స్‌కు గుడ్‌బై.. మళ్లీ ఓపెన్‌ఏఐలో చేరిన లిలియన్ వెంగ్
థింకింగ్ మెషీన్స్‌కు గుడ్‌బై.. మళ్లీ ఓపెన్‌ఏఐలో చేరిన లిలియన్ వెంగ్

Lilian Weng: థింకింగ్ మెషీన్స్‌కు గుడ్‌బై.. మళ్లీ ఓపెన్‌ఏఐలో చేరిన లిలియన్ వెంగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రముఖ పరిశోధకురాలు, థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ సహవ్యవస్థాపకురాలు లిలియన్ వెంగ్ మళ్లీ ఓపెన్‌ఏఐలో చేరుతున్నట్లు ప్రకటించారు. స్టార్టప్‌లో పని చేసిన అనుభవం తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆ వేగవంతమైన పని విధానానికి తాను ఇకపై అనుగుణంగా కొనసాగలేనని ఆమె వెల్లడించారు. ఈ వారమే థింకింగ్ మెషీన్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వెంగ్, తన నిర్ణయం ఎంతో కఠినమైనదని చెప్పారు.

వివరాలు 

2018 నుంచి 2024 చివరి వరకు ఓపెన్‌ఏఐలో పని చేసిన లిలియన్ వెంగ్

స్టార్టప్‌లలో పనిచేయాలంటే నిరంతరం అధిక వేగంతో ముందుకు సాగాల్సి ఉంటుందని,అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో కొనసాగడం తన వల్ల కాదని వెంగ్ పేర్కొన్నారు.

ఈ నిర్ణయం వల్ల తనతో కలిసి పనిచేసిన బృందాన్ని నిరాశపరుస్తానేమో అనే బాధ ఉన్నప్పటికీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

అయినప్పటికీ, ఏఐ పరిశోధనపై తన ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, మరింత స్థిరమైన వాతావరణంలో పరిశోధనలు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

లిలియన్ వెంగ్ 2018 నుంచి 2024 చివరి వరకు ఓపెన్‌ఏఐలో పనిచేశారు.అంతకుముందు ఫేస్‌బుక్, డ్రాప్‌బాక్స్,అఫర్మ్ వంటి సంస్థల్లో కూడా సేవలందించారు.

ఓపెన్‌ఏఐలో ఆమె అప్లైడ్ ఏఐ రీసెర్చ్ బృందాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా,సేఫ్టీ సిస్టమ్స్ విభాగానికి నాయకత్వం వహించారు.

వివరాలు 

అంతర్గత పరిశోధనలను మరింత వేగవంతం చేసే బృందానికి వెంగ్ నాయకత్వం

అలాగే జీపీటీ-4 అభివృద్ధిలో ప్రీ-ట్రైనింగ్ డేటా, మోడల్ భద్రత, పనితీరు మూల్యాంకనం, అమలు వంటి కీలక అంశాల్లో కూడా ఆమె విశేషంగా పనిచేశారు.

ఓపెన్‌ఏఐలో కొత్త బాధ్యతల్లో భాగంగా సంస్థ అంతర్గత పరిశోధనలను మరింత వేగవంతం చేసే బృందానికి వెంగ్ నాయకత్వం వహించనున్నారు.

తనను తాను మరింత మెరుగుపరుచుకునే సామర్థ్యం కలిగిన ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే ఓపెన్‌ఏఐ లక్ష్యంలో ఈ బృందం కీలక పాత్ర పోషించనుంది.

వెంగ్‌కు ఉన్న పరిశోధనా అనుభవం, సాంకేతిక నైపుణ్యం, సమర్థవంతమైన బృందాలను నిర్మించే సామర్థ్యం సంస్థకు ఎంతో ఉపయోగపడుతుందని ఓపెన్‌ఏఐ ప్రతినిధి పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ నుంచి వరుసగా కీలక సభ్యుల నిష్క్రమణ 

ఇదిలా ఉండగా, థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ నుంచి వరుసగా కీలక సభ్యులు నిష్క్రమించడం చర్చనీయాంశంగా మారింది.

సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి వ్యవస్థాపక బృందంలోని దాదాపు మూడో వంతు సభ్యులు ఇప్పటికే వైదొలిగారు. మొత్తం ఆరుగురు సహవ్యవస్థాపకుల్లో ప్రస్తుతం సీఈఓ మీరా మురాటి, ప్రధాన శాస్త్రవేత్త జాన్ షుల్‌మన్ మాత్రమే కొనసాగుతున్నారు.

మిగిలిన సహవ్యవస్థాపకులు బారెట్ జోఫ్, ల్యూక్ మెట్జ్ ఓపెన్‌ఏఐలో చేరగా, ఆండ్రూ టులోక్ మెటాలో చేరారు.

ADVERTISEMENT