LOADING...
Dinosaur Footprints: వింటర్ ఒలింపిక్స్ ప్రాంతంలో.. 21 కోట్ల సంవత్సరాల డైనోసార్ అడుగుజాడలు
వింటర్ ఒలింపిక్స్ ప్రాంతంలో.. 21 కోట్ల సంవత్సరాల డైనోసార్ అడుగుజాడలు

Dinosaur Footprints: వింటర్ ఒలింపిక్స్ ప్రాంతంలో.. 21 కోట్ల సంవత్సరాల డైనోసార్ అడుగుజాడలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్టెల్వియో నేషనల్ పార్క్‌లో ఉన్న ఒక పర్వతంపై దాదాపు 21 కోట్ల సంవత్సరాల నాటి వేలాది డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి. ఈ అరుదైన ఆవిష్కారం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అడుగుజాడలు కొన్ని చోట్ల 40 సెంటీమీటర్ల వరకు వ్యాసం కలిగి ఉండగా, సమాంతర వరుసల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా జాడల్లో వేళ్లు, గోర్లు స్పష్టంగా ముద్రించబడటం గమనార్హం. ఇవి ప్రోసారోపాడ్స్ అనే డైనోసార్లకు చెందినవిగా నిపుణులు భావిస్తున్నారు. ఇవి పొడవైన మెడలు, చిన్న తలలు కలిగిన శాకాహారి డైనోసార్లు.

వివరాలు 

పర్వత గోడపై వందల మీటర్ల వరకు విస్తరించిన అడుగుజాడలు 

ఈ ఆవిష్కారంపై మిలాన్‌కు చెందిన ప్యాలియోంటాలజిస్ట్ క్రిస్టియానో డాల్ సాస్సో స్పందిస్తూ, "నేను నివసిస్తున్న ప్రాంతంలో ఇంత అద్భుతమైన ఆవిష్కారం కనిపిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు" అని అన్నారు. గత సెప్టెంబర్‌లో ఎలియో డెల్లా ఫెరెరా అనే ఫోటోగ్రాఫర్,మిలాన్‌కు ఈశాన్యంగా ఉన్న స్టెల్వియో నేషనల్ పార్క్‌లోని ఒక నిటారుగా ఉన్న పర్వత గోడపై వందల మీటర్ల వరకు విస్తరించిన అడుగుజాడలను గుర్తించారు. అప్పట్లో ఆ ప్రాంతం త్రయాసిక్ యుగానికి చెందిన టైడల్ ఫ్లాట్‌గా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్రయాసిక్ కాలంలో, అంటే సుమారు 25 కోట్ల నుంచి 20 కోట్ల సంవత్సరాల క్రితం, ఈ ప్రాంతం సముద్రపు అలల ప్రభావంలో ఉండేదని, తరువాత కాలక్రమంలో ఆల్ప్స్ పర్వత శ్రేణిలో భాగంగా మారిందని పరిశోధకులు వివరిస్తున్నారు.

వివరాలు 

 10మీటర్ల పొడవు ఉండే ప్రోసారోపాడ్ డైనోసార్లు 

"ఈ ప్రాంతం మొత్తం డైనోసార్లతో నిండి ఉండేది.ఇది శాస్త్రీయంగా అపారమైన సంపద," అని డాల్ సాస్సో అన్నారు. డైనోసార్లు గుంపులుగా సమన్వయంతో కదిలేవారని,కొన్నిచోట్ల రక్షణ కోసం వలయాకారంగా గుంపులు ఏర్పడిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రోసారోపాడ్ డైనోసార్లు 10మీటర్ల పొడవు వరకు పెరిగేవి.ఇవి సాధారణంగా రెండు కాళ్లపై నడిచేవని,అయితే కొన్ని చోట్ల అడుగుజాడల ముందు చేతుల ముద్రలు కూడా కనిపించడం వల్ల, అవి కాసేపు ఆగి ముందు కాళ్లను నేలపై పెట్టి విశ్రాంతి తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని గుర్తించిన ఫోటోగ్రాఫర్ ఎలియో డెల్లా ఫెరెరా మాట్లాడుతూ,"మనం నివసిస్తున్న ప్రదేశాల గురించి,మన భూమి గురించి మనకు ఎంత తక్కువ తెలుసో ఈ ఆవిష్కారం మనందరినీ ఆలోచించేట్లు చేస్తుంది"అని చెప్పారు.

Advertisement

వివరాలు 

పరిశోధన కోసం డ్రోన్లు,రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ

ఇటలీ సంస్కృతి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ప్రాంతం చాలా దూరంగా ఉండటంతో అక్కడికి నడక మార్గాలు లేవు. అందుకే పరిశోధన కోసం డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు తెలిపింది. స్టెల్వియో నేషనల్ పార్క్, ఇటలీ-స్విట్జర్లాండ్ సరిహద్దు వద్ద ఉన్న ఫ్రాయెలే లోయలో ఉంది. ఇదే ప్రాంతానికి సమీపంలో వచ్చే ఏడాది వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. "ప్రకృతి, క్రీడల మధ్య గతం-వర్తమానం కలిసేలా చరిత్రే ఈ గొప్ప క్రీడా ఈవెంట్‌కు గౌరవం ఇచ్చినట్టుగా ఉంది," అని ఇటలీ సంస్కృతి మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement