Total Solar Eclipse: స్పెయిన్, రష్యాల్లో పగలే కమ్ముకున్న చీకట్లు.. భారత్‌లో ఎందుకు కనిపించలేదంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరార్థ గోళంలోని పలు ప్రాంతాల్లో 2026లోని ఏకైక సంపూర్ణ సూర్య గ్రహణం అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆవిష్కరించింది. యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూటే చీకట్లు కమ్ముకున్నాయి. ముఖ్యంగా 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంపై సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం ఇదే తొలిసారి కావడంతో ఈ అరుదైన ఘటనను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా లేదా కొంతవరకు భూమిపైకి రాకుండా పోతుంది. ఈ క్రమంలోనే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా దర్శనమిచ్చింది.
వివరాలు
పగటిపూటనే కొన్ని నిమిషాల పాటు కమ్ముకున్న చీకట్లు
ఈ ప్రాంతాల్లో సుమారు 2 నిమిషాల 18 సెకన్ల పాటు సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పేయడంతో పగటిపూటే రాత్రిని తలపించేంతగా చీకట్లు అలముకున్నాయి.
యూరప్, వాయవ్య ఆఫ్రికా, ఈశాన్య ఉత్తర అమెరికాలోని అనేక ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణ గ్రహణం కాకుండా పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది.
మరోవైపు పశ్చిమ యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయం సమయంలోనే గ్రహణం ఏర్పడటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సూర్యుడు అస్తమించే సమయంలో గ్రహణం కనిపించడంతో ఈ అరుదైన దృశ్యాన్ని 'సన్‌సెట్ ఎక్లిప్స్'గా పేర్కొన్నారు.
ఆకాశంలో ఏర్పడిన ఈ దృశ్యం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
2026లో ఏర్పడిన ఏకైక సంపూర్ణ గ్రహణం ఇదే
🌅 🌕 TOTALITY IN SPAIN: The total solar eclipse created a picturesque view as the moon passed in front of the sun on Wednesday, darkening the skyline during sunset.#Solareclipse #Earth #Moon #Sun #Spain #FOXWeather pic.twitter.com/NU5PQzToat
— FOX Weather (@foxweather) August 12, 2026
వివరాలు
శాస్త్రవేత్తలకు కీలక అవకాశం
సంపూర్ణ సూర్యగ్రహణం కేవలం ప్రజలకు కనువిందు చేసే ఖగోళ ఘటన మాత్రమే కాదు.. శాస్త్రవేత్తలకు కూడా ఎంతో కీలకమైన అవకాశాన్ని అందిస్తుంది.
సాధారణ పరిస్థితుల్లో స్పష్టంగా కనిపించని సూర్యుడి బాహ్య వాతావరణమైన 'కరోనా'ను పరిశీలించేందుకు సంపూర్ణ గ్రహణ సమయం ఉపయోగపడుతుంది.
అందుకే ఈ గ్రహణాన్ని సూర్యుడి కరోనా అధ్యయనానికి శాస్త్రవేత్తలు విలువైన అవకాశంగా పరిగణించారు.
వివరాలు
భారత్‌లో ఎందుకు కనిపించలేదు?
ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించకపోవడానికి ప్రధాన కారణం అది ఏర్పడిన సమయం.
గ్రహణం సంభవించిన సమయంలో భారత్‌లో రాత్రి కావడంతో ఇక్కడి నుంచి సూర్యుడిని వీక్షించే అవకాశం లేదు.
అందువల్ల యూరప్, రష్యా తదితర ప్రాంతాల్లో ప్రజలు పగలే చీకట్లను చూసి ఆశ్చర్యపోయినా.. భారత్‌లో మాత్రం ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయారు.