TRAI New Recharge Plans : మొబైల్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట.. తక్కువ ధరలకే రీచార్జ్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
మొబైల్ వినియోగదారులకి కేంద్రం ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. డేటా అవసరం లేని వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం కాల్స్, సందేశాలే ఉండే ప్రత్యేక రీచార్జ్ పథకాలను ప్రవేశపెట్టాలని సూచించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన ముసాయిదా ప్రకారం,ప్రస్తుతం 28, 56, 84 రోజుల గడువులతో అందిస్తున్న పథకాల మాదిరిగానే అదే గడువుతో కేవలం కాల్స్, సందేశాలు మాత్రమే కలిగిన ప్రత్యేక ప్లాన్స్ ను తప్పనిసరిగా అందించాలని ఆదేశించింది. అలాగే డేటా లేని ఈ ప్లాన్ ధరలు,డేటాతో కూడిన ప్లాన్ ల కంటే తక్కువగా ఉండాలని స్పష్టం చేసింది.
వివరాలు
డేటా తొలగించిన మేరకు ధర
అంటే డేటా తొలగించిన మేరకు ధరను కూడా తగ్గించాలని సూచించింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ఏప్రిల్ 28 లోపు లిఖితపూర్వకంగా లేదా ఇమెయిల్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొంది. చాలా కాలంగా వినియోగదారులు తమకు డేటా అవసరం లేదని, తక్కువ ధరలో కాల్స్, సందేశాలు మాత్రమే ఉన్న పథకాలు కావాలని కోరుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి టెలికాం సంస్థ కనీసం ఒక ప్రత్యేక ప్లాన్ ని కేవలం కాల్స్, సందేశాల కోసం అందించాలని ముందే సూచనలు ఇచ్చింది. అయితే కొన్ని సంస్థలు మాత్రమే పరిమితంగా ఈ సదుపాయం అందిస్తున్నాయని గుర్తించింది. దీంతో వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.
వివరాలు
టెలికాం సంస్థలు అందిస్తున్న ప్లాన్స్ వివరాలు
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఇంటర్నెట్ వినియోగం లేని సాధారణ వినియోగదారులకు రీచార్జ్ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని టెలికాం సంస్థలు అందిస్తున్న ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. Vodafone Idea సంస్థ రూ.99 పథకంలో మాట్లాడుకునే విలువ, కొద్దిపాటి డేటాను పరిమిత కాలానికి అందిస్తోంది. అలాగే 28 రోజుల పథకంలో పరిమిత డేటా, సందేశాలతో అపరిమిత కాలింగ్ సౌకర్యం కల్పిస్తోంది. Bharti Airtel కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధర పథకాలను పరిమిత డేటాతో అందిస్తుండగా, మరో పథకంలో 28 రోజుల పాటు కాల్స్, డేటా, సందేశాల సదుపాయం ఇస్తోంది. Reliance Jio కూడా తక్కువ గడువుతో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ కలిగిన పథకాన్ని అందిస్తోంది.