Relaiance Jio: జియోకు ట్రాయ్ షాక్.. టారిఫ్ మార్పులకు ఏప్రిల్ 14 డెడ్‌లైన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో అమలు చేస్తున్న కొన్ని టారిఫ్ విధానాలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్లాన్లు పూర్తిగా పారదర్శకంగా లేవని, వినియోగదారుల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని ట్రాయ్ గుర్తించింది. ముఖ్యంగా రోజుకు 1GB డేటా అందించే ప్రారంభ స్థాయి ప్లాన్లను జియో నిలిపివేయడంపై విచారణ జరిపిన ట్రాయ్, కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.249, రూ.199 ప్లాన్లు కేవలం జియో రిటైల్ స్టోర్లలో మాత్రమే లభిస్తుండగా, రూ.209 ప్లాన్ మాత్రం 'మై జియో' యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉండటం ట్రాయ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
వివరాలు
టారిఫ్ ఆర్డర్ నిబంధనలకు విరుద్ధం
ఒకే రకమైన సేవల కోసం వినియోగదారులు వేర్వేరు వేదికలను ఆశ్రయించాల్సి రావడం టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇక జియో ఫోన్, జియో భారత్ వంటి నిర్దిష్ట పరికరాలు ఉపయోగించే వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక ఆఫర్లను పరిమితం చేయడం కూడా వివక్షాత్మక చర్యగా ట్రాయ్ పేర్కొంది. ఒక నిర్దిష్ట ఫోన్ లేదా టెక్నాలజీ కొనుగోలు చేస్తేనే తక్కువ ధర ప్లాన్లు లభిస్తాయనే నిబంధన వినియోగదారుల స్వేచ్ఛను హరిస్తుందని తెలిపింది. దీనివల్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) సదుపాయంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ పరిస్థితులను సరిదిద్దుకోవడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది.
వివరాలు
రిటైల్ స్టోర్లలో సమానంగా అందుబాటులో ఉంచాలి
ఆ లోపు రూ.249, రూ.199, రూ.209 వంటి అన్ని ప్లాన్లను వెబ్‌సైట్, మొబైల్ యాప్, రిటైల్ స్టోర్లలో సమానంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అదే విధంగా జియో భారత్, జియో ఫోన్లకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక ప్లాన్లను ఇతర మొబైల్ వినియోగదారులందరికీ కూడా వర్తింపజేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది. మొదటి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయన్న జియో వాదనను కూడా ట్రాయ్ తోసిపుచ్చింది. వినియోగదారులకు ప్లాన్ల ఎంపికలో పూర్తి పారదర్శకత, సమానత్వం ఉండాలని ట్రాయ్ ఈ సందర్భంగా స్పష్టంగా పేర్కొంది.