Loading...
USA: మనిషికి పంది కిడ్నీ.. 271 రోజులు పనిచేసింది.. చివరికి ఏం జరిగిందంటే?
మనిషికి పంది కిడ్నీ.. 271 రోజులు పనిచేసింది.. చివరికి ఏం జరిగిందంటే?

USA: మనిషికి పంది కిడ్నీ.. 271 రోజులు పనిచేసింది.. చివరికి ఏం జరిగిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో వైద్యరంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి అమర్చిన జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీ ఏకంగా 271 రోజుల పాటు పనిచేసింది. ఈ కాలంలో అతడికి డయాలసిస్ అవసరం లేకుండానే జీవించాడు. అయితే 271 రోజుల తర్వాత పంది కిడ్నీలో సమస్యలు తలెత్తడంతో వైద్యులు దాన్ని తొలగించి, మానవ కిడ్నీని అమర్చారు. రెండు కిడ్నీలు విఫలం.. అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్ర్యూ రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిలో పాడైన కిడ్నీలను తొలగించి కొత్త కిడ్నీ అమర్చాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. దీంతో ఆండ్ర్యూ కుటుంబ సభ్యులు కిడ్నీ దాత కోసం ప్రయత్నించారు. అయితే సరైన డోనర్ దొరకలేదు.

వివరాలు 

పంది కిడ్నీని అమర్చిన వైద్యులు

దీంతో వైద్యులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని ఆండ్ర్యూకు అమర్చారు.

2025 జనవరిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. పంది కిడ్నీ విజయవంతంగా పనిచేయడంతో ఆండ్ర్యూ 271 రోజుల పాటు డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే జీవించాడు.

271 రోజుల తర్వాత కిడ్నీలో సమస్యలు

అయితే 271 రోజుల తర్వాత పంది కిడ్నీలో సమస్యలు ప్రారంభమయ్యాయి. దీంతో వైద్యులు మరోసారి శస్త్రచికిత్స చేసి ఆ కిడ్నీని తొలగించారు.

అనంతరం కొన్ని రోజుల పాటు ఆండ్ర్యూ డయాలసిస్‌పై జీవించాడు. 2026లో మరణించిన ఓ వ్యక్తి నుంచి లభించిన మానవ కిడ్నీని ఆండ్ర్యూకు విజయవంతంగా అమర్చారు.

వివరాలు 

పంది కిడ్నీ ఎందుకు విఫలమైంది?

ఆండ్ర్యూ శరీరంలో పంది కిడ్నీ 271 రోజుల పాటు పనిచేయడం వైద్యరంగంలో కీలక పరిణామమని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కు చెందిన శాస్త్రవేత్తలు, వారి సహచరులు పేర్కొన్నారు.

వైద్య చరిత్రలో ఇలాంటి కేసు ఇదే తొలిసారి అని తెలిపారు.

పంది కిడ్నీ ఎక్కువ కాలం పనిచేయడం వల్ల దాని సూక్ష్మ రక్తనాళాల్లో (మైక్రోవ్యాస్క్యులర్) గాయాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీంతో వాపు, అంటే ఇన్‌ఫ్లమేషన్‌ కూడా చోటుచేసుకున్నట్లు వివరించారు. అదే సమయంలో ఆండ్ర్యూకు ఇన్‌ఫెక్షన్‌ రావడం మరో సమస్యగా మారింది.

పంది కిడ్నీ అమర్చిన సుమారు ఆరు నెలల తర్వాత ఇమ్యూనోసప్రెషన్‌ వ్యవస్థ దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ పరిణామాలన్నింటి కారణంగానే పంది కిడ్నీ పనితీరు క్రమంగా క్షీణించి చివరకు విఫలమైందని పేర్కొన్నారు.

ADVERTISEMENT