Truecaller voicemail: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రూకాలర్ కొత్త ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే వాయిస్‌మెయిల్ ఫీచర్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్‌స్టంట్ ట్రాన్స్‌క్రిప్షన్ సదుపాయం ఉండటంతో, వచ్చిన వాయిస్ మెసేజ్‌ను యూజర్లు తమకు ఇష్టమైన భాషలో చదవగలుగుతారు. ఈ ఫీచర్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని ట్రూకాలర్ స్పష్టం చేసింది. అంతేకాదు, వాయిస్ మెసేజ్‌లు యూజర్ ఫోన్‌లోనే భద్రపరచబడతాయని తెలిపింది.
వివరాలు
ఇన్‌స్టంట్ ట్రాన్స్‌క్రిప్షన్‌తో పాటు స్పామ్ రక్షణ
ఈ కొత్త వాయిస్‌మెయిల్ ఫీచర్‌లో స్మార్ట్ కాల్ కేటగరైజేషన్, స్పామ్ కాల్‌లను వడపోసే ఫిల్టరింగ్, వినియోగదారుల అవసరానికి తగ్గట్టు మార్చుకునే ప్లేబ్యాక్ స్పీడ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, నేపాలీ, పంజాబీ, సంస్కృతం, ఉర్దూ ఇలా మొత్తం 12 భారతీయ భాషలకు ఈ సేవ మద్దతు ఇస్తోంది. రోజువారీ జీవనంలో వాయిస్‌మెయిల్‌ను మరింత ఉపయోగకరంగా మార్చాలనే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చామని ట్రూకాలర్ సీఈవో రిషిత్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఇన్‌స్టంట్ ట్రాన్స్‌క్రిప్షన్‌తో పాటు స్పామ్ రక్షణ కలిగిన ఈ సదుపాయం ద్వారా ట్రూకాలర్‌లో కాలింగ్ అనుభవం మరింత మెరుగవుతుందని ఆయన పేర్కొన్నారు.