Twitter Retire : ఎక్స్ యూజర్లకు హెచ్చరిక.. ట్విట్టర్ డొమైన్‌కు గుడ్‌బై.. ఈ తేదీలోగా 2FA రీసెట్ చేసుకోకపోతే.. మీ అకౌంట్ పోయినట్టే..!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ అధీనంలోని ఎక్స్ సంస్థ, తమ ప్లాట్‌ఫారమ్‌ను పూర్తిగా x.comకి మార్చే ప్రక్రియలో భాగంగా, పాత twitter.com డొమైన్‌ను అధికారికంగా నిలిపివేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటివరకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) కోసం హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీలు లేదా పాస్‌కీలను ఉపయోగిస్తున్న యూజర్లు 2025 నవంబర్ 10లోపు తమ లాగిన్ వివరాలను కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి అకౌంట్లు ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయని కంపెనీ హెచ్చరించింది.
వివరాలు
సెక్యూరిటీ కీల రీ-ఎన్‌రోల్ తప్పనిసరి
ఎక్స్ సేఫ్టీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న హార్డ్‌వేర్ ఆధారిత 2FA లాగిన్ సదుపాయాలు నేరుగా twitter.com డొమైన్‌తో లింక్ అయ్యి ఉన్నాయి. కాబట్టి, ఇప్పుడు అన్ని అథెంటికేషన్ సిస్టమ్స్ x.comకి మారుతున్న నేపథ్యంలో, యూజర్లు తమ సెక్యూరిటీ కీలను కొత్త డొమైన్‌లో తిరిగి నమోదు చేయడం తప్పనిసరి అవుతుంది. కంపెనీ స్పష్టతనిచ్చిన ప్రకారం, ఈ అప్‌డేట్ ఎలాంటి సెక్యూరిటీ సమస్య వల్ల కాదు, కేవలం డొమైన్ మైగ్రేషన్ కారణంగా మాత్రమే తీసుకున్న సాంకేతిక చర్య. అంతేకాదు, ఎస్ఎంఎస్ కోడ్‌లు లేదా అథెంటికేషన్ యాప్‌ల ద్వారా జరిగే 2FA పద్ధతులు ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. వాటికి కొత్తగా సెటప్ అవసరం ఉండదు.
వివరాలు
నవంబర్ 10 తర్వాత జరిగే మార్పులు
నవంబర్ 10 నాటికి యూజర్లు తమ హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీలు రీ-రిజిస్టర్ చేయకపోతే, వారి అకౌంట్లు ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి. ఆ తర్వాత, అకౌంట్ యాక్సెస్ కోసం సెక్యూరిటీ కీని తిరిగి రిజిస్టర్ చేయాలి లేదా ఇతర 2FA విధానానికి మారాలి. అవసరమైతే 2FAని తాత్కాలికంగా ఆపి, తిరిగి లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ సూచన ప్రకారం, ముఖ్యంగా పెద్ద అకౌంట్లు, వెరిఫైడ్ యూజర్లు, లేదా అధికారిక ప్రొఫైల్‌లు కనీసం ఒక టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పద్ధతిని తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉంచుకోవాలి.
వివరాలు
ట్విట్టర్ డొమైన్ రిటైర్మెంట్ ప్రభావం
ట్విట్టర్.కామ్ డొమైన్ రీబ్రాండింగ్ కారణంగా పలు అంతరాయాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ డొమైన్ ఇంటర్నెట్ అంతటా విస్తరించి ఉంది. ఇందులో API కీలు, ట్వీట్ లింకులు, మిలియన్ల సంఖ్యలో షేర్ చేసిన లింకులు ఉన్నాయి. దీంతో డెవలపర్‌లు, సాధారణ యూజర్లు కొంతకాలం తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. అయితే, twitter.com పూర్తిగా ఎప్పుడు ఇన్‌యాక్టివ్ అవుతుందనే స్పష్టమైన షెడ్యూల్‌ను ఎక్స్ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ తాజా సూచనల ప్రకారం, ఈ అథెంటికేషన్ డొమైన్ రిటైర్ దశ వేగంగా చేరుకుంటోందని తెలుస్తోంది.