LOADING...
Foreign Made Drones: జాతీయ భద్రత పేరుతో విదేశీ డ్రోన్లపై అమెరికా నిషేధం
జాతీయ భద్రత పేరుతో విదేశీ డ్రోన్లపై అమెరికా నిషేధం

Foreign Made Drones: జాతీయ భద్రత పేరుతో విదేశీ డ్రోన్లపై అమెరికా నిషేధం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందన్న కారణాలతో, విదేశాల్లో తయారైన కొత్త డ్రోన్ల దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ (DoD) లేదా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) నుంచి ప్రత్యేకంగా సిఫార్సు ఉంటే తప్ప, ఇకపై విదేశీ డ్రోన్లను అమెరికాలోకి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఈ డ్రోన్లను జాతీయ భద్రతకు "అంగీకరించలేని ప్రమాదం"గా భావిస్తూ, FCC తన 'కవర్డ్ లిస్ట్'లో చేర్చింది.

వివరాలు 

FCC నిర్ణయంపై DJI స్పందన

ఈ నిర్ణయంపై డ్రోన్ తయారీ సంస్థ DJI అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ గ్లోబల్ పాలసీ హెడ్ అడమ్ వెల్ష్ మాట్లాడుతూ,ఈ నిర్ణయం తమను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని తీసుకోలేదన్నా,ఎలాంటి ఆధారాల మీద ఈ నిర్ణయం తీసుకున్నారో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ నుంచి స్పష్టత లేదన్నారు. అయితే, ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ అమెరికా మార్కెట్‌పై తమ నిబద్ధత కొనసాగుతుందని, ఇప్పటికే ఉన్న DJI డ్రోన్ల వినియోగంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

వివరాలు 

విదేశీ డ్రోన్లపై FCC ఆందోళనలు

డిసెంబర్ 21న వివిధ శాఖలతో కూడిన అంతరశాఖ సంస్థ నుంచి వచ్చిన జాతీయ భద్రత నివేదిక ఆధారంగా FCC ఈ చర్యలు తీసుకుంది. ఆ నివేదికలో, విదేశీ తయారీ 'అన్‌క్రూడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్' (UAS) మరియు వాటి కీలక భాగాలు అమెరికా భూభాగంలో నిరంతర నిఘా, డేటా చోరీ, విధ్వంసక చర్యలకు ఉపయోగపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా సున్నితమైన సమాచారం సేకరించడం లేదా అనధికార ప్రవేశాలకు అవకాశం కల్పించవచ్చని పేర్కొంది.

Advertisement

వివరాలు 

ఇప్పటికే ఉన్న విదేశీ డ్రోన్ల వినియోగానికి అనుమతి

అయితే, ఇప్పటికే విదేశీ డ్రోన్లు కలిగిన వినియోగదారులకు FCC ఊరట కల్పించింది. ప్రస్తుతం వాడుతున్న డ్రోన్లను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. రక్షణ శాఖ లేదా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలు, ఏదైనా డ్రోన్ లేదా దాని భాగాలు జాతీయ భద్రతకు ముప్పు కాదని తేల్చితే, వాటిని కవర్డ్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో, అమెరికా మార్కెట్‌లో కొనసాగాలనుకునే వినియోగదారులు, తయారీదారులకు తమ ఉత్పత్తులు సురక్షితమని నిరూపించుకునే కొంత అవకాశం మిగిలినట్లయ్యింది.

Advertisement