
Vinayaka Chavithi: వినాయక చవితి స్పెషల్.. దేశంలోని ప్రత్యేక గణపతి దేవాలయాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి మొదలైంది. గణపయ్య కోసం ప్రతి ఊరు, ప్రతి వీధిలో పండుగ వాతావరణం అలరారుతోంది. మార్కెట్లలో రంగురంగుల, వివిధ ఆకారాల్లో బొజ్జ గణేశ విగ్రహాలు కనిపిస్తుండగా, గణపతి మండపాలు భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంలో గణనీయమైన భక్తి, చారిత్రక ప్రత్యేకత కలిగిన గణపతి ఆలయాలను సందర్శించడం భక్తులకు ఒక అపూర్వమైన అనుభూతిని అందిస్తుంది. భారతదేశంలో గణేష్ చతుర్థిని అత్యంత భక్తి భావంతో జరుపుకుంటారు. 2025లో ఈ పండుగ ఆగస్టు 27న ప్రారంభమై,అనంత చతుర్దశి నాడు నిమజ్జనంతో ముగుస్తుంది. పదిరోజుల పాటు కొనసాగే ఈ వేడుకలో గణపయ్యను దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటారు.
వివరాలు
1. సిద్ధివినాయక ఆలయం - ముంబై
ఈ ఆలయాలు భక్తి కేంద్రమే కాకుండా, సంస్కృతి, చరిత్ర, నిర్మాణ శైలి పరంగా కూడా విశిష్టమైన స్థానం కలిగి ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సిద్ధివినాయక ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన గణేశ దేవాలయాలలో ఒకటి. "సిద్ధివినాయక" అంటే కోరికలను తీర్చే గణేశుడు అని అర్థం. ఇక్కడ ఒకే నల్లరాయి తో చెక్కిన రెండు చేతుల విగ్రహం ప్రతిష్టించబడింది. గణేష్ చతుర్థి రోజున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సామాన్య భక్తులు సహా లక్షలాది మంది ఇక్కడికి వచ్చి గణపయ్యను దర్శించుకుంటారు.
వివరాలు
2. దగదుషేత్ హల్వాయి వినాయక ఆలయం - పూణే
మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న ఈ ఆలయం విశేష ఖ్యాతి పొందింది. గణేష్ చతుర్థి సందర్భంగా ఆలయాన్ని బంగారం, వెండితో అద్భుతంగా అలంకరిస్తారు. ప్రత్యేక మహా ఆరతులు నిర్వహిస్తారు. హల్వాయి దగదుషేత్ తన కుమారుడు మరణం తరువాత ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. పండుగ రోజుల్లో ఇక్కడ జరిగే ఉత్సవ వైభవాన్ని చూడటానికి అపార సంఖ్యలో భక్తులు చేరుతారు.
వివరాలు
3. అష్టవినాయక ఆలయాలు - మహారాష్ట్ర
మహారాష్ట్రలోని అష్టవినాయకులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. వీటిలో మోరేశ్వర, సిద్ధివినాయక, బల్లాలేశ్వర, వరద వినాయక, చింతామణి, గిరిజాత్మజ, మహాగణపతి, మూషక వినాయక ఆలయాలు ఉన్నాయి. ఈ ఎనిమిది ఆలయాలను ఒకే యాత్రలో దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. 4. ఖజురహో గణేశ ఆలయం - మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఉన్న ఈ ఆలయం తన ప్రత్యేకమైన విగ్రహం మరియు నిర్మాణ కళతో ఆకర్షిస్తుంది. పశ్చిమ దేవాలయ సమూహంలో భాగమైన ఈ ఆలయం వినాయక చవితి రోజున పర్యాటకులు, భక్తులతో కిటకిటలాడుతుంది.
వివరాలు
5. త్రినేత్ర గణేశ ఆలయం - రణతంబోర్, రాజస్థాన్
రణతంబోర్ కోటలోని త్రినేత్ర గణేశ ఆలయం తన ప్రత్యేకతతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణపయ్య మూడవ కంటితో భక్తులను దర్శించుకుంటారు. భారతదేశంలో ఎక్కడైనా వివాహం జరగబోతే మొదటి ఆహ్వాన పత్రాన్ని ఈ ఆలయంలోని గణపతికి పంపడం శుభప్రదమని ప్రజల విశ్వాసం. 6. బోహ్రా గణేశ ఆలయం - ఉదయపూర్, రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఈ ఆలయం స్థానిక ప్రజలకు ప్రధాన భక్తి కేంద్రం. గణేష్ చతుర్థి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. భక్తులు ఆనందంతో పాల్గొంటారు.
వివరాలు
7. వర సిద్ధి వినాయక ఆలయం - చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లాలో 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ఎంతో పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడి గణేశ విగ్రహం స్వయంభువుగా వెలసిందని చెబుతారు. కాలక్రమేణా విగ్రహ పరిమాణం పెరుగుతుందనే విశ్వాసం ఉంది. వినాయక చవితి రోజున రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. 8. కలమస్సేరి మహాగణపతి ఆలయం - కేరళ దక్షిణ భారతదేశంలో గణపతి ఆరాధనకు ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ ఆలయం కేరళలో ఉంది. గణేష్ చతుర్థి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలతో పాటు నృత్యం, సంగీతం, భక్తి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు.