Reels: రీల్స్ చూసేవారికి షాక్..పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్‌లో 'జస్ట్ ఐదు నిమిషాలు' అంటూ రీల్స్ చూడటం మొదలుపెట్టి.. ఎంత సమయం గడిచిందో తెలియకుండా గంటల తరబడి స్క్రోల్ చేసిన సందర్భాలు చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. అయితే ఇలా షార్ట్ వీడియోలు చూడటం ఎందుకు అంతగా ఆకట్టుకుంటుందనే దానిపై తాజాగా ఓ మెదడు అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మనకు నచ్చిన షార్ట్ వీడియోలను చూస్తున్న సమయంలో.. దృష్టి, ప్రవర్తన నియంత్రణకు సంబంధించిన మెదడులోని రెండు ప్రాంతాల్లో కార్యకలాపాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
వివరాలు
పరిశోధకులు ఏం చెప్పారంటే..
'NeuroImage' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 56 మంది యువకులు పాల్గొన్నారు.
వారు తమకు నచ్చిన విధంగా షార్ట్ వీడియోలను చూస్తున్న సమయంలో మెదడులో జరిగే మార్పులను పరిశోధకులు ఫంక్షనల్ MRI (fMRI) ద్వారా పరిశీలించారు.
అలాగే గ్లూటమేట్, GABA వంటి రసాయనాలను పరిశీలించేందుకు మాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీని కూడా ఉపయోగించారు.
అయితే దీని అర్థం రీల్స్, షార్ట్స్ చూస్తే మెదడు పనిచేయడం ఆగిపోతుందని కాదు.
షార్ట్ వీడియోలు శాశ్వతంగా మెదడు దెబ్బతినడానికి కారణమవుతాయని కూడా ఈ అధ్యయనం నిరూపించలేదు.
పరిశోధకులు ప్రధానంగా మెదడులోని డోర్సల్ యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (dACC), డోర్సోలేటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (dlPFC) ప్రాంతాలపై దృష్టి పెట్టారు.
వివరాలు
మెదడుపై ప్రభావం..
మెదడులోని 'కాగ్నిటివ్ కంట్రోల్ నెట్‌వర్క్'లో భాగం. మన ప్రవర్తనను గమనించడం, దృష్టిని నియంత్రించడం, చేస్తున్న పనిని ఎప్పుడు మార్చాలో నిర్ణయించుకోవడం వంటి కీలక విధుల్లో ఈ ప్రాంతాలు పనిచేస్తాయి.
పాల్గొన్నవారు తమకు నచ్చిన వీడియోలను చివరి వరకు చూసినప్పుడు.. అంతగా నచ్చని వీడియోలను మధ్యలోనే ఆపేసిన సందర్భాలతో పోలిస్తే ఈ రెండు మెదడు ప్రాంతాల్లో కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
దీనిని 'కాగ్నిటివ్ కంట్రోల్ నెట్‌వర్క్ డీయాక్టివేషన్'గా పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే ఆసక్తికరంగా.. వీడియోలను చూస్తున్న సమయంలో dACC, dlPFC ప్రాంతాల మధ్య సమాచార మార్పిడి మరింత బలపడింది.
ముఖ్యంగా తమకు నచ్చిన వీడియోలను చూస్తున్నప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
వివరాలు
అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
అదేవిధంగా dACC ప్రాంతంలో విశ్రాంతి సమయంలో గ్లూటమేట్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో ఈ మెదడు ప్రాంతాల కార్యకలాపాల తగ్గుదల తక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.
అయితే షార్ట్ వీడియోలు చూస్తే తప్పకుండా మెదడు నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందని పరిశోధకులు చెప్పడం లేదు.
అత్యంత ఆకట్టుకునే వీడియోలను చూస్తున్నప్పుడు.. మన దృష్టి పూర్తిగా ఆ కంటెంట్‌పై కేంద్రీకృతమవడంతో ప్రవర్తనను పర్యవేక్షించడం, నియంత్రించడం వంటి విధుల్లో కీలకమైన మెదడు వ్యవస్థల కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉందనేది పరిశోధకుల అభిప్రాయం.
ఇదే కారణంగా వరుసగా వచ్చే వినోదాత్మక వీడియోలను చూస్తూ వాటి నుంచి బయటపడటం కొందరికి కష్టంగా అనిపించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ఈ అధ్యయనం నియంత్రిత పరిస్థితుల్లో నిర్వహించబడింది.
వివరాలు
64 మంది విద్యార్థులపై ప్రయోగం..
షార్ట్ వీడియోలను వేగంగా, ఎక్కువసేపు చూడటం మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటి సామర్థ్యాలపై ఎలా ప్రభావం చూపుతుందనే అంశంపై ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి.
నికోలస్ బార్టన్, మైఖేల్ స్మిత్ 2025లో నిర్వహించిన ఓ అధ్యయనంలో.. ఒకదాని తర్వాత మరొకటి వేగంగా మారే షార్ట్ వీడియోలను పరిమితి లేకుండా చూసినవారు ఆ తర్వాత చేసిన 'ప్రాస్పెక్టివ్ మెమరీ' పరీక్షలో తక్కువ పనితీరు కనబరిచారు.
అంటే భవిష్యత్తులో చేయాల్సిన పనిని గుర్తుంచుకునే సామర్థ్యాన్ని ప్రాస్పెక్టివ్ మెమరీ అంటారు.
అలాగే 2026 జూన్‌లో 'Behavioral Sciences'లో ప్రచురితమైన మరో అధ్యయనంలో ఒక ప్రయోగంలో 106 మంది, మరో ప్రయోగంలో 64 మంది విద్యార్థులను పరిశీలించారు.
వివరాలు
జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపే అవకాశం..
ఎక్కువసేపు షార్ట్ వీడియోలు చూడటం వల్ల భవిష్యత్తులో చేయాల్సిన పనులను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గినట్లు ఇందులో గుర్తించారు.
అయితే ఈ ప్రభావం ఆ పనికి అవసరమైన దృష్టి స్థాయిపై ఆధారపడి ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.
మొత్తంగా చూస్తే.. షార్ట్ వీడియోలను ఎలా చూస్తున్నామన్నది కూడా ముఖ్యమేనని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.
ముఖ్యంగా ఒక వీడియో నుంచి మరో వీడియోకు వేగంగా మారడం, ఎక్కువసేపు కంటెంట్‌లో మునిగిపోవడం వంటి అంశాలు మన దృష్టి, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.