WEF Davos 2026: దావోస్ వేదికగా ఏఐలో కొత్త విప్లవం.. ఏజెంటిక్ ఏఐపై చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐ (AI) ఒకవైపు వరం, మరోవైపు సవాల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే రోజుకో అడుగు ముందుకు వేస్తూ ఏఐ మరింత అభివృద్ధి చెందుతోంది. తాజాగా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు టెక్ కంపెనీల అగ్ర నేతలు హాజరవుతున్న నేపథ్యంలో 'ఏజెంటిక్ ఏఐ'పై విస్తృత చర్చ సాగుతోంది. ఏజెంటిక్ ఏఐ అంటే స్వయంగా నిర్ణయాలు తీసుకుని పనిచేసే కృత్రిమ మేధ. ఇప్పటివరకు ఏఐ ఎక్కువగా చాట్‌బాట్ల రూపంలోనే ఉపయోగంలో ఉంది. మనం ప్రశ్న అడిగితే సమాధానం ఇచ్చే స్థాయిలోనే ఉంది. కానీ ఇక ముందు దశ ఆటోమేషన్. ఆ స్థాయిని మించి పనిచేసే సామర్థ్యమే ఏజెంటిక్ ఏఐ ప్రత్యేకత.
వివరాలు
ఏజెంటిక్ ఏఐ అనేది ఏఐలో వచ్చే తదుపరి పెద్ద దశ
ఏజెంటిక్ ఏఐ లక్ష్యాలను స్వయంగా నిర్ణయించగలదు. ఎక్కువగా ప్రాంప్టులు ఇవ్వకుండానే ఏం చేయాలో ప్లాన్ చేసుకుని, దానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఫలితాలను గమనిస్తూ, అవసరమైతే తన పనితీరును తానే మార్చుకుంటుంది. ఇందులో మనిషి జోక్యం చాలా తక్కువగా ఉండొచ్చు. ఇదే సమయంలో ఇది ఎంత ఉపయోగకరమో, అంతే ప్రమాదకరమా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, ఏజెంటిక్ ఏఐ అనేది ఏఐలో వచ్చే తదుపరి పెద్ద దశ. క్లిష్టమైన పనులను ప్రారంభం నుంచి ముగింపు వరకు నిర్వహించే సామర్థ్యం దీనికుంది. ఉత్పాదకతను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషించగలదని అంచనా. అయితే తక్కువ మానవ నియంత్రణతోనే పనిచేయడం వల్ల నైతిక విలువలు, నియంత్రణ అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వివరాలు
సాధారణ ఏఐకి, ఏజెంటిక్ ఏఐకి మధ్య స్పష్టమైన తేడా
సాధారణ ఏఐకి, ఏజెంటిక్ ఏఐకి మధ్య స్పష్టమైన తేడా ఉంది. సాధారణ ఏఐ మనం అడిగిన ప్రశ్నలకు మాత్రమే స్పందిస్తుంది.ఒక్కో దశలో పని చేస్తుంది. లక్ష్యాలను గుర్తుంచుకునే సామర్థ్యం తక్కువ. టూల్స్ ఉపయోగించడంలో కూడా పరిమితులుంటాయి. కానీ ఏజెంటిక్ ఏఐ స్వతంత్రంగా పని చేస్తుంది. ఒకే లక్ష్యాన్ని పెట్టుకుని అనేక దశల్లో పని పూర్తి చేస్తుంది.
వివరాలు
ఏజెంటిక్ ఏఐలో మనిషి జోక్యం అవసరం ఉండదు
తన లక్ష్యాలను, స్థితిని గుర్తుంచుకుంటుంది. అవసరమైన టూల్స్‌ను స్వయంగా ఉపయోగించుకుంటుంది. సాధారణ ఏఐతో పని చేస్తే ప్రతి దశలో మనిషి జోక్యం అవసరం అవుతుంది. ఫలితాన్ని పరిశీలించి తదుపరి అడుగు వేయాలి. కానీ ఏజెంటిక్ ఏఐలో ఆ అవసరం చాలా వరకు ఉండదు. తప్పులు వస్తే తానే సరిదిద్దుకుంటూ, పని పూర్తయ్యే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇదే భవిష్యత్తు ఏఐ దిశగా టెక్ ప్రపంచం అడుగులు వేస్తున్న సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.