LOADING...
WhatsApp ban in Russia: రష్యాలో వాట్సాప్‌కు షాక్… పూర్తిస్థాయిలో సేవలు నిలిపివేత
WhatsApp ban : రష్యాలో వాట్సాప్‌కు షాక్… పూర్తిస్థాయిలో సేవలు నిలిపివేత

WhatsApp ban in Russia: రష్యాలో వాట్సాప్‌కు షాక్… పూర్తిస్థాయిలో సేవలు నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో వాట్సాప్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించినట్లు తాజాగా మెటా సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ మద్దతుతో రూపొందించిన 'మ్యాక్స్' అనే సూపర్ యాప్‌ను ప్రజల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఫిబ్రవరి 11న ఒక్కసారిగా కోట్లాది మంది వాట్సాప్ వినియోగదారులు సేవలు కోల్పోయారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 కోట్ల మందికి పైగా యూజర్లు కనెక్ట్‌గా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వాట్సాప్ తెలిపింది.

వివరాలు 

వీచాట్ తరహా 'మ్యాక్స్' యాప్‌ను ప్రోత్సహిస్తున్న రష్యా ప్రభుత్వం

చైనాలోని వీచాట్ తరహాలోనే రూపొందించిన 'మ్యాక్స్' యాప్‌ను రష్యా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలు,డాక్యుమెంట్ల భద్రపరిచడం,బ్యాంకింగ్,ఇతర ప్రభుత్వ-వాణిజ్య కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. అలాగే మెసేజ్‌లు పంపడం,డబ్బు బదిలీ చేయడం, ఆడియో-వీడియో కాల్స్ వంటి సాధారణ సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఈ యాప్ ద్వారా ప్రజలపై నిఘా పెట్టే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ అవాస్తవ ఆరోపణలేనని ప్రభుత్వ మీడియా కొట్టిపారేస్తోంది. ఈ యాప్‌ను తొలుత అభివృద్ధి చేసిన సంస్థ వీకాంటాక్టే కాగా, అది ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇక దేశంలో అమ్ముడయ్యే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో మ్యాక్స్ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్‌పైనా ఆంక్షలు

ఇదిలా ఉండగా, విదేశీ మెసేజింగ్ యాప్‌లను క్రమంగా పక్కన పెట్టే దిశగా రష్యా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్ సేవలపై కూడా పరిమితులు విధించింది. రష్యా పౌరుల భద్రత కోసమే టెలిగ్రామ్‌పై ఆంక్షలు విధిస్తున్నామని, నేరపూరిత,ఉగ్రవాద కంటెంట్‌ను తొలగించడంలో ఆ యాప్ సహకరించడం లేదని ప్రభుత్వం ఆరోపించింది. టెలిగ్రామ్‌పై ఈ వారం నుంచే నియంత్రణలు అమలు చేయాలని కమ్యూనికేషన్స్ నియంత్రణ సంస్థ యోచిస్తోందని వార్తలు వచ్చాయి. నిషేధిత కంటెంట్ తొలగించలేదని కారణంతో టెలిగ్రామ్‌కు భారీ జరిమానా కూడా విధించారు. గతేడాది డిసెంబరులో ఆపిల్ ఫేస్‌టైమ్ యాప్‌ను కూడా రష్యా బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

వివరాలు 

రష్యా చట్టాలు పాటిస్తేనే వాట్సాప్‌కు తిరిగి అవకాశం: క్రెమ్లిన్

ఇక వాట్సాప్ భవితవ్యంపై స్పందించిన క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్, రష్యా చట్టాలకు అనుగుణంగా మెటా సంస్థ వ్యవహరిస్తేనే తిరిగి అనుమతి లభించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చర్చలకు సిద్ధంగా ఉంటే ఒప్పందానికి అవకాశం ఉంటుందని, లేకపోతే వాట్సాప్ తిరిగి వచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై క్రెమ్లిన్ వెంటనే స్పందించలేదని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

Advertisement