WhatsApp: వాట్సాప్‌లో 'జాప్స్' కొత్త ఫీచర్.. చూసిన వెంటనే మాయమయ్యే ఫొటోలు, వీడియోలు!
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 'జాప్స్ (Zaps)' పేరుతో ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా ఫొటోలు, చిన్నపాటి వీడియోలను క్షణాల్లో ఇతరులకు పంపించవచ్చు. అయితే వీటిని అవతలి వ్యక్తి ఒక్కసారి చూసిన వెంటనే వారి స్క్రీన్ నుంచి మాయమవుతాయి. తొలుత ఈ ఫీచర్‌ను 'ఇన్‌స్టెంట్స్ (Instants)' పేరుతో రూపొందించిన వాట్సాప్.. తాజాగా 'జాప్స్'గా పేరు మార్చినట్లు తెలుస్తోంది. వాట్సాప్ అప్‌డేట్లపై నిఘా ఉంచే వాబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది.
వివరాలు
అవతలి వ్యక్తి చూసిన వెంటనే అవి వారి చాట్ నుంచి మాయం
ఈ కొత్త ఫీచర్ కోసం వాట్సాప్‌లో ప్రత్యేకమైన కెమెరా ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
దీని ద్వారా యాప్‌లోనే నేరుగా ఫొటోలు తీయడం, చిన్న వీడియోలను రికార్డు చేసి పంపించడం చేయవచ్చు.
అయితే ఫోన్ గ్యాలరీలో ఇప్పటికే ఉన్న ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసే అవకాశం ఉండదు.
ఒకసారి జాప్‌ను పంపిన తర్వాత అవతలి వ్యక్తి దాన్ని చూసిన వెంటనే వారి చాట్ నుంచి తొలగిపోతుంది.
అయితే పంపిన వ్యక్తి మాత్రం తన చాట్ హిస్టరీలో వాటిని చూడగలుగుతారని ప్రాథమిక సమాచారం.
ఒకే చాట్‌లో వరుసగా పలు జాప్‌లను పంపితే.. వాటన్నింటినీ ఒకేచోట కౌంటర్ రూపంలో చూపించనున్నారు.
వివరాలు
పబ్లిక్ బీటా వెర్షన్‌లోనూ అందుబాటులోకి
ఉదాహరణకు '2 జాప్స్' అని కనిపిస్తుంది. సాధారణ వాట్సాప్ సందేశాలకు ఉన్నట్లుగానే వీటికి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-End Encryption) భద్రత కల్పించనున్నారు.
వ్యక్తిగత కాంటాక్టులకు మాత్రమే కాకుండా గ్రూపులు, పబ్లిక్ ఛానళ్లకు కూడా జాప్‌లను పంపించే సదుపాయం ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
జాప్‌ను తెరిచినప్పుడు దాన్ని పంపిన వ్యక్తి పేరు కనిపిస్తుంది.
అలాగే ఎమోజీల ద్వారా స్పందించడంతో పాటు టెక్స్ట్ రూపంలో రిప్లై ఇచ్చే అవకాశం కూడా కల్పించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. ఇంకా పబ్లిక్ బీటా వెర్షన్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రాలేదు.
దీనిపై మెటా లేదా వాట్సాప్ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.