WhatsApp: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఐఫోన్ తరహా కొత్త ఫీచర్!
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐఫోన్ తరహా మెసేజ్ యాక్షన్ మెనూను త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొద్దిమంది బీటా యూజర్లకు పరీక్షా దశలో విడుదల చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్‌లో మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయడం, ఎడిట్ చేయడం లేదా ఇతర చర్యలు చేపట్టాలంటే స్క్రీన్ పైభాగంలోని టూల్‌బార్ లేదా ఓవర్‌ఫ్లో మెనూను ఉపయోగించాల్సి వచ్చేది. దీంతో సాధారణ పనులు కూడా కొంత సమయం తీసుకునేవి. కొత్త అప్‌డేట్‌తో ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది.
వివరాలు
WhatsApp Beta for Android 2.26.23.8 వెర్షన్‌లో కొత్త కాంటెక్స్ట్ మెనూ
WABetaInfo నివేదిక ప్రకారం, WhatsApp Beta for Android 2.26.23.8 వెర్షన్‌లో కొత్త కాంటెక్స్ట్ మెనూను ప్రవేశపెట్టారు. యూజర్లు ఏదైనా మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే, ఆ మెసేజ్ పక్కనే యాక్షన్ మెనూ కనిపిస్తుంది. దీంతో అవసరమైన ఆప్షన్లను వెంటనే ఉపయోగించుకోవచ్చు. తరచుగా ఉపయోగించే రిప్లై, ఫార్వర్డ్, ఎడిట్ వంటి ఆప్షన్లు నేరుగా కనిపిస్తాయి. తక్కువగా ఉపయోగించే ఫీచర్లను ప్రత్యేకంగా "More" విభాగంలో ఉంచారు. దీంతో ఇంటర్‌ఫేస్ మరింత శుభ్రంగా, సులభంగా కనిపించడంతో పాటు యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.
వివరాలు
మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే కొత్త మెనూ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది
ఈ కొత్త డిజైన్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్‌ల మధ్య వినియోగ అనుభవాన్ని ఒకేలా తీసుకురావాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది. అయితే మెసేజ్‌ను ఎంచుకునే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పటిలాగే మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే కొత్త మెనూ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. దీంతో యూజర్లు కొత్తగా ఏ విధానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లలో కూడా పనిచేస్తుందని సమాచారం. దీంతో మొత్తం యాప్‌లో ఒకే తరహా అనుభవం లభించనుంది. వాస్తవానికి ఈ ఫీచర్‌పై వాట్సాప్ చాలా కాలంగా పని చేస్తోంది. 2023లోనే ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తున్నట్లు వెల్లడైంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇది యూజర్ల ముందుకు రానుంది.
వివరాలు
కొద్దిమంది బీటా టెస్టర్లకే ఈ అప్‌డేట్
ప్రస్తుతం కొద్దిమంది బీటా టెస్టర్లకే ఈ అప్‌డేట్ పరిమితమైంది. సాధారణ యూజర్లకు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై వాట్సాప్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే పరీక్షలు విజయవంతంగా పూర్తైతే రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అప్‌డేట్ వాట్సాప్‌లో పెద్ద మార్పులు తీసుకురాకపోయినా, ప్రతిరోజూ కోట్లాది మంది చేసే మెసేజింగ్ అనుభవాన్ని మరింత వేగవంతంగా, సులభంగా మార్చే అవకాశముంది.