Whatsapp New Feature: వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ప్రారంభం.. ప్రైవసీతో పాటు కొత్త రిస్క్?
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ వినియోగదారులకు కంపెనీ కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇకపై ఎవరితోనైనా చాట్ చేయాలంటే తప్పనిసరిగా వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం ఉండదు. వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ మార్పు నిజంగానే భద్రతను పెంచుతుందా? లేక సైబర్ నేరాలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందా? అనే చర్చ కూడా మొదలైంది.
వివరాలు
కొత్త ఫీచర్ ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్ అధికారికంగా కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను వెల్లడించకుండా, కేవలం యూజర్‌నేమ్ ఆధారంగా ఇతరులతో చాట్ ప్రారంభించే అవకాశం పొందుతారు. నంబర్ అవసరం లేకుండానే చాట్ వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరచడమే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ తరహాలో ప్రతి యూజర్ తనకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను ఎంపిక చేసుకుని రిజర్వ్ చేసుకోవచ్చు. అదనపు భద్రత కోసం 'యూజర్‌నేమ్ కీ' లేదా పిన్ సౌకర్యాన్ని కూడా వాట్సాప్ అందించనుంది. దీంతో కేవలం యూజర్‌నేమ్ తెలిసినంత మాత్రాన అపరిచితులు నేరుగా మిమ్మల్ని సంప్రదించడం లేదా వేధించడం సాధ్యం కాకుండా అదనపు రక్షణ లభిస్తుంది.
వివరాలు
యూజర్‌నేమ్ ద్వారా ఎవరైనా మిమ్మల్ని కనుగొగలరా?
చాలామందిలో ఉన్న సందేహానికి కూడా వాట్సాప్ స్పష్టత ఇచ్చింది. యూజర్‌నేమ్ ఆధారంగా వెతికే పబ్లిక్ సెర్చ్ డైరెక్టరీని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురావడం లేదు. అంటే మీతో ఎవరైనా కనెక్ట్ కావాలంటే, వారికి మీ ఖచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసి ఉండాలి. యాదృచ్ఛికంగా యూజర్‌నేమ్ ద్వారా మిమ్మల్ని కనుగొనే అవకాశం ఉండదు. మొబైల్ నంబర్ మాత్రం తప్పనిసరి ఈ కొత్త ఫీచర్ వచ్చినప్పటికీ, వాట్సాప్ ఖాతాను సృష్టించడానికి, ధృవీకరించడానికి మొబైల్ నంబర్ ఇప్పటికీ తప్పనిసరిగా అవసరమే. యూజర్‌నేమ్ అనేది కేవలం ఇతరులతో సంప్రదింపులు జరపడానికి, చాటింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పటికే టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లు ఈ సౌకర్యాన్ని అందిస్తుండగా, ఇప్పుడు వాట్సాప్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది.
వివరాలు
సైబర్ మోసాలు, భద్రతపై ఆందోళన
ఈ ఫీచర్ గోప్యత పరంగా ప్రయోజనకరంగా కనిపిస్తున్నప్పటికీ, సాంకేతిక నిపుణులు, సైబర్ భద్రతా సంస్థలు కొన్ని కీలక హెచ్చరికలు చేస్తున్నాయి. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు. యూజర్‌నేమ్ మార్పులతో పెరిగే ప్రమాదం నిపుణుల ఆందోళనకు ప్రధాన కారణం యూజర్‌నేమ్‌ను అవసరమైనప్పుడు పలుమార్లు మార్చుకునే అవకాశం ఉండటమే. ఒకవేళ మోసగాళ్లు నేరానికి పాల్పడిన తర్వాత వెంటనే తమ యూజర్‌నేమ్‌ను మార్చేస్తే, వారి అసలు గుర్తింపును గుర్తించడం కష్టమవుతుందని వారు చెబుతున్నారు. దీంతో నకిలీ గుర్తింపులతో మోసాలు చేయడం సులభమవుతుందని, సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా దేశ భద్రతపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అమలు
వాట్సాప్ ఈ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రైవసీ పరంగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నప్పటికీ, భద్రతా పరంగా కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఫీచర్‌ను దుర్వినియోగం కాకుండా అడ్డుకునేందుకు వాట్సాప్ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.