WhatsApp: సెప్టెంబర్ 8 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. మెటా సంస్థకు చెందిన ఈ మెసేజింగ్ యాప్, 2026 సెప్టెంబర్ 8 నుంచి ఆండ్రాయిడ్ 6.0 కంటే పాత వెర్షన్లకు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆండ్రాయిడ్ 5.0, 5.1 వెర్షన్లపై నడుస్తున్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. కొత్త ఫీచర్లను సరిగా అందించడానికి, యాప్ పనితీరును మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 17 వరకు అప్‌డేట్లు వచ్చినా, ఇంకా పాత ఫోన్ల వినియోగం తగ్గలేదు. ముఖ్యంగా భారత్, బ్రెజిల్, పాకిస్థాన్, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో పాత మొబైల్స్ ఎక్కువగా ఉన్నాయి.
వివరాలు
iOS పరికరాలపై ప్రభావం ఉండదు
ఇలాంటి పరికరాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కూడా అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఇప్పటికే ప్రభావిత యూజర్లకు వాట్సాప్ అలర్ట్ మెసేజ్ చూపిస్తూ సమాచారం అందిస్తోంది. సెప్టెంబర్ 8 తర్వాత పాత వెర్షన్లలో యాప్ పనిచేయదని స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో యూజర్లు తమ చాట్స్‌ను గూగుల్ డ్రైవ్ ద్వారా బ్యాకప్ చేసుకోవాలని సూచిస్తోంది. అవసరమైతే లోకల్ స్టోరేజ్‌లో కూడా బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మార్పు కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకే వర్తిస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు ఎలాంటి ప్రభావం ఉండదు. కాబట్టి ఆండ్రాయిడ్ 5.0 లేదా 5.1 వాడుతున్న వారు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలి లేదా కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.