Bermuda: సముద్ర గర్భంలో దాగిన బెర్ముడా అసలు కథ..వెలుగులోకి ఆ రహస్యం
ఈ వార్తాకథనం ఏంటి
అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ పేరు వినగానే, విచిత్రంగా అదృశ్యమైన నౌకలు మరియు విమానాల కథలు చాలామందికి గుర్తుకొస్తాయి. అక్కడ ఏదో మర్మమైన శక్తి పనిచేస్తోందనే అభిప్రాయాలు కూడా చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ వాదనలను సాధారణంగా అంగీకరించరు. ఈ అంశాన్ని పక్కన పెడితే, బెర్ముడా ప్రాంతానికి సంబంధించిన మరో శాస్త్రీయ మిస్టరీ మాత్రం ఎన్నో దశాబ్దాలుగా పరిశోధకులను అయోమయంలోకి నెట్టింది. తాజాగా ఆ సందేహానికి సమాధానం లభించింది.
వివరాలు
శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
బెర్ముడా దీవుల వద్ద గత మూడు కోట్ల సంవత్సరాలుగా ఎలాంటి అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవించకపోయినా, ఆ ప్రాంతం సమీప సముద్ర గర్భంతో పోలిస్తే ఇంకా ఎత్తైన స్థితిలో ఎందుకు ఉందన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. హవాయ్ వంటి అనేక అగ్నిపర్వత దీవుల సమూహాలు భూమి లోపలి మ్యాంటిల్ పొర నుంచి పైకి వచ్చిన వేడి, తేలికపాటి రాతి పదార్థాల వల్ల ఏర్పడతాయి. ఈ ప్రక్రియను మ్యాంటిల్ ప్లూమ్ అని పిలుస్తారు. ఈ వేడి పదార్థం పైకి చొచ్చుకొస్తూ ఉండటంతో అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. దాని ప్రభావంతో సముద్ర గర్భం కొంత ఎత్తుగా మారుతుంది. కొంతకాలం తర్వాత భూమి పైభాగంలోని టెక్టానిక్ ఫలకాలు ఆ ప్లూమ్ నుంచి దూరమవుతాయి.
వివరాలు
పరిశోధనలో విస్తుపోయే నిజాలు..
బెర్ముడా విషయంలో మాత్రం ఈ సహజ ప్రక్రియ పూర్తిగా కనిపించలేదు. ఆ ప్రాంతం ఇప్పటికీ పరిసరాల కంటే దాదాపు 1,600 అడుగుల ఎత్తులో ఉంది. కోట్ల సంవత్సరాలుగా అక్కడ అగ్నిపర్వత కార్యకలాపాలు లేకపోయినా, ఆ భూభాగం ఇంకా కిందకు దిగకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సైన్స్‌కు చెందిన విలియం ఫ్రేజర్, యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫ్రీ పార్క్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. వారు భారీ భూకంపాల సమయంలో ఉత్పత్తి అయ్యే సైస్మిక్ తరంగాలను ఆధారంగా తీసుకున్నారు. ఈ తరంగాలు భూమి అంతర్భాగాల గుండా ప్రయాణించే సమయంలో ఎదురయ్యే పదార్థాల సాంద్రత, నిర్మాణం ఆధారంగా వాటి వేగం మారుతుంది.
వివరాలు
12 మైళ్ల మందంతో ఉన్న ప్రత్యేక శిలా పొర..
బెర్ముడా ప్రాంతంలోని ఒక భూప్రకంపన పరిశోధనా కేంద్రంలో నమోదైన సమాచారం ఆధారంగా శాస్త్రవేత్తలు విశ్లేషణ చేపట్టారు. దాని ద్వారా దీవి అడుగుభాగంలో సుమారు 20 మైళ్ల లోతు వరకు ఉన్న భూ అంతర్భాగ నిర్మాణాన్ని అంచనా వేశారు. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. భూమి పైపొర అయిన కస్టు కింద సుమారు 12 మైళ్ల మందంతో ఉన్న ప్రత్యేక శిలాపొరను వారు గుర్తించారు. ఈ శిలా పొర చుట్టుపక్కల మ్యాంటిల్ భాగంతో పోలిస్తే తక్కువ సాంద్రత కలిగి ఉంది. అందువల్ల అది ఎక్కువ తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంది.
వివరాలు
పరిశోధకుల అంచనా ఇదే..
ఈ పొర ఒక తేలియాడే వేదికలా పనిచేస్తూ, సముద్ర గర్భాన్ని, బెర్ముడా ప్రాంతాన్ని పైస్థాయిలో నిలబెడుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక రాతిపొరను "అండర్‌ప్లేటింగ్" అని పిలుస్తారు. కోట్ల సంవత్సరాల క్రితం బెర్ముడా ప్రాంతంలో అగ్నిపర్వతాలు చురుకుగా ఉన్న సమయంలో భూమి లోతుల్లో నుంచి పైకి వచ్చిన శిలాద్రవం చల్లబడటంతో ఈ పొర ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.