Human Voice: ఒక్కో మనిషి గొంతు ఒక్కోలా ఎందుకు వినిపిస్తుంది? శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి గొంతు అతడి ప్రత్యేక గుర్తింపుల్లో ఒకటి. జనంతో నిండిన ప్రదేశంలో కూడా మనకు దగ్గరైన వారి గొంతును విన్న వెంటనే గుర్తుపట్టగలం. దీనికి కారణం మన శరీర నిర్మాణంలో జరిగిన పరిణామ మార్పులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2022లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మనుషుల గొంతు ఇతర కోతులు,వానరాల గొంతులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా అభివృద్ధి చెందింది. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం.. కోతులు,వానరాల గొంతు తంతువుల పైన చిన్న వోకల్ మెంబ్రేన్‌లు, గొంతులో గాలి సంచులు ఉంటాయి. కానీ కాలక్రమేణా మనుషుల్లో ఇవి మాయమై స్థిరమైన వాయిస్ బాక్స్ ఏర్పడింది. దీంతో మనిషి గొంతు స్పష్టంగా, నియంత్రితంగా వినిపిస్తుంది. ఇతర జంతువుల మాదిరిగా గందరగోళ శబ్దాలు రావు.
వివరాలు
బలమైన శబ్ద తరంగాలను "ఫార్మెంట్స్" అంటారు
గొంతు తంతువుల నుంచి శబ్దం బయటకు వచ్చిన తర్వాత అది గొంతు,నోరు,ముక్కు మార్గాల ద్వారా ప్రయాణిస్తుంది. ఈ భాగాలు ప్రతిధ్వని గదుల్లా పనిచేసి శబ్దాన్ని మార్చేస్తాయి.ఈ ప్రక్రియలో మిగిలే బలమైన శబ్ద తరంగాలను శాస్త్రవేత్తలు"ఫార్మెంట్స్"అని పిలుస్తారు. ప్రతి వ్యక్తి గొంతు వేరుగా వినిపించడానికి ఇవే ప్రధాన కారణమని చెబుతున్నారు. మనిషి గొంతు మారడం వెనుక గొంతు పొడవు,నోటి ఆకారం,తల నిర్మాణం,సైనస్‌లు,గొంతు లోతు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. చిన్నతేడా ఉన్నా శబ్దం మారిపోతుంది. అందుకే ఒకే ఎత్తు ఉన్న ఇద్దరు వ్యక్తుల గొంతులు కూడా పూర్తిగా భిన్నంగా వినిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే పురుషుల గొంతు సాధారణంగా బరువుగా,మహిళల గొంతు పలుచగా ఉండటానికి వారి వాయిస్ ట్రాక్ట్ పరిమాణమే కారణమని వెల్లడించారు.
వివరాలు
తల్లి గొంతును గుర్తించగల శిశువులు
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గర్భంలో ఉన్న శిశువులు కూడా తమ తల్లి గొంతును గుర్తించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతరుల గొంతులతో పోలిస్తే తల్లి స్వరానికి భిన్నంగా స్పందిస్తారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనుషులు సమూహాలుగా జీవించడం ప్రారంభించిన తర్వాత ప్రత్యేక గొంతు అవసరమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వేల ఏళ్ల క్రితం పెద్ద గుంపులుగా జీవించడం, దూరంలో ఉన్న వారిని సులభంగా గుర్తించడం కోసం ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన గొంతు అభివృద్ధి చెందిందని వారు చెబుతున్నారు.