చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?
చంద్రయాన్-3 మిషన్ ని జులై 14వ తేదీన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లాంచ్ చేయనుంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద సాఫీగా ల్యాండ్ కావడానికి చంద్రయాన్-3 ని సరిగ్గా తీర్చి దిద్దారు. చంద్రుడి దక్షిణ ధృవం మీదనే ఎందుకు? చంద్రుడి దక్షిణ ధృవం మీద పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, పెద్ద పెద్ద బిలాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలోకి సూర్యకాంతి వెళ్ళక కొన్ని బిలియన్ సంవత్సరాలు అవుతున్నందున్న ఈ ప్రాంతం మొత్తం చీకటిగా ఉంటోంది. అంతేకాదు మైనస్ 203డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రదేశంలో ఉన్న వస్తువుల్లో పెద్దగా మార్పులు రావు.
సౌరకుటుంబం తొలిరోజుల గురించి తెలుసుకోవడానికి చంద్రయాన్-3
దక్షిణ ధృవంలో ఉన్న వస్తువుల్లో కొన్నేళ్ళ నుండి ఎలాంటి మార్పులు వచ్చి ఉండవన్న ఉద్దేశ్యంతో, ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తే సౌరకుటుంబం ఏర్పడిన తొలిరోజుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రుడి దక్షిణ ధృవం మీదకు చంద్రయాన్-3 ని పంపిస్తున్నారు.దక్షిణ ధృవం మీద ఇస్రో మాత్రమే కాకుండా నాసా కూడా దృష్టి పెట్టింది. 2025లో అర్టెమిస్-3 మిషన్ ను దక్షిణ ధృవం మీదకు పంపాలని నాసా ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతిష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జులై 14వ తేదీన మద్యాహ్నం 2:35నిమిషాలకు LVM3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కానుంది. ఆగస్టు 24న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కావొచ్చని అంచనా.