LOADING...
HAL: శాటిలైట్‌ మార్కెట్‌లో హాల్‌కి విస్తృత అవకాశాలు.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఒప్పందం ప్రభావం
శాటిలైట్‌ మార్కెట్‌లో హాల్‌కి విస్తృత అవకాశాలు.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఒప్పందం ప్రభావం

HAL: శాటిలైట్‌ మార్కెట్‌లో హాల్‌కి విస్తృత అవకాశాలు.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఒప్పందం ప్రభావం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) సాంకేతికత బదిలీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (హాల్) కీలక ముందడుగు వేసింది. హాల్‌, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌ (NSIL), ఇస్రోతో కలిసి బెంగళూరులో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ మూడు దశలతో కూడిన ప్రయోగ వాహనం. ఇది 500 కిలోగ్రాముల వరకు బరువున్న ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టగలదు. ఒప్పందం ప్రకారం, తొలి రెండు సంవత్సరాల్లో హాల్‌ సాంకేతికతను పూర్తిగా అవగాహన చేసుకుంటుంది. ఆ తర్వాత 10 సంవత్సరాలపాటు ఉత్పత్తి దశలో కొనసాగుతుంది.

Details

భారీ స్థాయిలో ఉత్పత్తి

ఈ క్రమంలో హాల్‌కు డిజైన్‌, రూపకల్పన, నాణ్యత, నియంత్రణ, అనుసంధానం, ప్రయోగ కార్యకలాపాలు, పోస్ట్‌ ఫ్లైట్ విశ్లేషణ డాక్యుమెంటేషన్‌, శిక్షణతో సహా సాంకేతికతపై ప్రత్యేకమైన, బదిలీ చేయలేని లైసెన్స్‌ లభిస్తుంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్లను తీర్చేందుకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ సాంకేతికతను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాల్సిన బాధ్యతను హాల్‌ స్వీకరించనుంది. హాల్‌ ప్రయత్నాలు ఎస్‌ఎస్‌ఎల్‌వీ స్వదేశీ తయారీని నిర్ధారించడమే కాకుండా భారతీయ ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, విస్తృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు కొత్త అవకాశాలు సృష్టిస్తాయని హాల్‌ సీఎండీ డీకే సునీల్ పేర్కొన్నారు.

Details

శాటిలైట్‌ మార్కెట్‌లో హాల్‌ స్థానం ఎక్కువ 

ఈ ఒప్పందంతో ప్రయోగ వాహనాన్ని నిర్మించడానికి, హక్కులు పొందడానికి, నిర్వహించడానికి హాల్‌కు స్వయం ప్రతిపత్తి లభిస్తుందని ఆయన అన్నారు. దీంతో శాటిలైట్‌ మార్కెట్‌లో హాల్‌ స్థానం మరింత బలపడనుంది. ఒప్పంద సంతక కార్యక్రమంలో హాల్‌ సీఈవో జయకృష్ణన్, ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్, ఎన్‌ఎస్‌ఐఎల్‌ ఛైర్మన్ ఎం. మోహన్, ఇన్‌స్పేస్‌ సాంకేతిక డైరెక్టర్ రాజీవ్ జ్యోతి, ఛైర్మన్ పవన్ కుమార్ గోయెంకా, హాల్‌ డైరెక్టర్లు, సీనియర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.