X: ఒకేచోట బుక్‌మార్క్స్, లైక్స్, వీడియోలు.. Xలో కొత్త 'హిస్టరీ' ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'హిస్టరీ' (History) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన కంటెంట్‌ను సులభంగా తిరిగి చూసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ iOS డివైస్‌లలో అందుబాటులోకి వచ్చింది. X ప్రొడక్ట్ హెడ్ Nikitia Bier తెలిపిన వివరాల ప్రకారం.. యూజర్లు సేవ్ చేసుకున్న లేదా చూసిన కంటెంట్‌ను మళ్లీ వెతకాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఇప్పటివరకు X మొబైల్ యాప్‌లో ఎడమవైపు మెనూలో కనిపించే 'Bookmarks' ఆప్షన్‌ను ఇప్పుడు 'History'గా మార్చారు. ఈ కొత్త సెక్షన్‌లో బుక్‌మార్క్స్, లైక్స్, వీడియోలు, ఆర్టికల్స్ అంటూ నాలుగు విభాగాలు ఉంటాయి.
వివరాలు
'History' సెక్షన్ పూర్తిగా వ్యక్తిగతం
యూజర్లు సేవ్ చేసుకున్న పోస్టులు మాత్రమే కాకుండా, వారు చూసిన వీడియోలు, చదివిన ఆర్టికల్స్ కూడా ఆటోమేటిక్‌గా ఇందులో చేరతాయి. దీంతో అవసరమైన కంటెంట్‌ను ఎప్పుడైనా సులభంగా తిరిగి చూడొచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో X ఇప్పుడు వెబ్ బ్రౌజర్‌లా పనిచేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందుగా యాప్‌లో వేర్వేరు చోట్ల ఉన్న బుక్‌మార్క్స్, లైక్స్ వంటి ఫీచర్లను ఇప్పుడు ఒకేచోటకు తీసుకొచ్చారు. అలాగే 'History' సెక్షన్ పూర్తిగా వ్యక్తిగతంగా ఉంటుందని, ఇతరులకు ఇది కనిపించదని కంపెనీ స్పష్టం చేసింది.
వివరాలు
లాంగ్ ఫార్మ్ ఆర్టికల్స్‌కు కూడా ఈ ఫీచర్ ఉపయోగం
ఇక Xలో లాంగ్ ఫార్మ్ ఆర్టికల్స్‌కు కూడా ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. 280అక్షరాల పరిమితికి మించి బిజినెస్‌లు,క్రియేటర్లు పెద్ద ఆర్టికల్స్ పోస్టు చేసేందుకు కంపెనీ ఇప్పటికే ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు హిస్టరీ ట్యాబ్ ద్వారా యూజర్లు స్క్రోల్ చేస్తూ చూసిన ఆర్టికల్స్‌ను మళ్లీ చదివే అవకాశం ఉంటుంది. దీంతో యాప్‌లోనే ఒక పర్సనల్ న్యూస్ రీడర్‌లా అనుభూతి కలిగించనుంది. ఫేస్‌బుక్,గూగుల్ వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెబ్‌సైట్లకు వచ్చే ట్రాఫిక్ తగ్గుతున్న సమయంలో X ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అల్గోరిథమ్ మార్పులు,AI ఆధారిత ఫీచర్ల కారణంగా బయటి వెబ్‌సైట్లకు క్లిక్స్ తగ్గుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈపరిస్థితిని అవకాశంగా మార్చుకుని,పబ్లిషర్లు, కంటెంట్ క్రియేటర్లు నేరుగా తమ ప్లాట్‌ఫామ్‌లోనే ఆర్టికల్స్ రాయాలని X భావిస్తున్నట్లు తెలుస్తోంది.