LOADING...
USB cable: భవిష్యత్తులో ఫోన్లు USB కేబుల్‌ లేకుండా రావచ్చా? కంపెనీల ప్రణాళిక ఇదేనా!
భవిష్యత్తులో ఫోన్లు USB కేబుల్‌ లేకుండా రావచ్చా? కంపెనీల ప్రణాళిక ఇదేనా!

USB cable: భవిష్యత్తులో ఫోన్లు USB కేబుల్‌ లేకుండా రావచ్చా? కంపెనీల ప్రణాళిక ఇదేనా!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

2020లో ఆపిల్‌ ఐఫోన్‌ 12 సిరీస్‌ను విడుదల చేసినప్పుడు పవర్‌ అడాప్టర్‌ను బాక్స్‌లో ఇవ్వకపోవడం అందరికీ షాక్‌ ఇచ్చింది. అప్పటి నుంచి చాలా కంపెనీలు అదే దారిలో నడుస్తూ చార్జర్‌ను బాక్స్‌ నుంచి తొలగించాయి. ఇప్పుడు అయితే, ఫోన్‌తో వచ్చే యూఎస్‌బీ కేబుల్‌ కూడా తీసేయాలని కొన్ని కంపెనీలు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ అథారిటీ నివేదిక ప్రకారం, తాజాగా రెడిట్‌లో వచ్చిన పోస్టులలో Sony Xperia 10 VII మోడల్‌ ఫోన్‌లో చార్జింగ్‌ బ్రిక్‌ మాత్రమే కాకుండా కేబుల్‌ కూడా ఇవ్వలేదని వినియోగదారులు తెలిపారు. ఇది యాదృచ్ఛికం కాదు, బాక్స్‌ మీదే కేబుల్‌ లేనట్టు స్పష్టంగా చూపించారు కూడా.

వివరాలు 

కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకుంటున్నాయి

కంపెనీలు చెబుతున్న కారణం మాత్రం పాతదే.. ప్యాకేజింగ్‌లో తక్కువ వస్తువులు ఉంటే పర్యావరణానికి మేలు జరుగుతుందట,వ్యర్థ పదార్థాలు కూడా తగ్గుతాయట. కానీ, వాస్తవానికి ఇలా చేయడం వల్ల కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకుంటున్నాయి అనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పరు. ధర మాత్రం అలాగే ఉంచి, యాక్సెసరీలను కట్‌ చేస్తే లాభం వారికే కదా! వినియోగదారుల దగ్గర ఇప్పటికే పాత మొబైల్స్‌ నుంచి వచ్చిన కేబుల్లు,చార్జర్లు ఉన్నాయనే భావనతో కొత్త ఫోన్ల బాక్స్‌లో వాటిని ఇవ్వడం అవసరం లేదని కంపెనీలు చెబుతున్నాయి. కానీ,అన్ని కేబుల్లు ఒకేలా పనిచేయవు. ఫోన్‌ మోడల్‌, చార్జింగ్‌ స్టాండర్డ్‌ ఆధారంగా వేగం మారిపోతుంది. అంటే పాత కేబుల్‌తో కొత్త ఫోన్‌ వేగంగా చార్జ్‌ అవుతుందని చెప్పలేం.

వివరాలు 

ఫోన్‌ బాక్స్‌లో వస్తున్న వస్తువులు తగ్గిపోతున్నా, ధర మాత్రం పెరుగుతూనే ఉంది

సోనీ పెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ షేర్‌ కలిగిన కంపెనీ కాకపోయినా, ఫోన్‌ బాక్స్‌లో కేబుల్‌ను తీసేయడం వంటి నిర్ణయం ఇతర బ్రాండ్‌లను కూడా అదే దారిలో నడిపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక వచ్చే రోజుల్లో ఆపిల్‌, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఫోన్‌ బాక్స్‌లో కేబుల్‌ ఇవ్వకపోతే, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వినియోగదారుల కోణంలో చూస్తే.. ఫోన్‌ బాక్స్‌లో వస్తున్న వస్తువులు తగ్గిపోతున్నా, ధర మాత్రం పెరుగుతూనే ఉంది!