Arattai: జోహో అరట్టైలో.. త్వరలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ సాంకేతిక సంస్థ జోహో (Zoho) తన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అరట్టై యాప్ (Arattai)లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఫీచర్ అధికారికంగా విడుదలకు ముందు, సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వినియోగదారుల అభిప్రాయాలను కోరారు. ఈ సదుపాయాన్ని యాప్‌లో డిఫాల్ట్‌గా ఉంచాలా లేక ఐచ్ఛికంగా (optional) ఇవ్వాలా అన్నదానిపై ఆయన యూజర్లకు రెండు ఎంపికలను సూచించారు. అదనంగా, యాప్‌కి సంబంధించిన కొత్త ఇంటర్‌ఫేస్ చిత్రాలను కూడా ఎక్స్ (X)లో పంచుకున్నారు.
వివరాలు
త్వరలో ప్రత్యేకమైన e2ee ట్యాబ్
అరట్టై యాప్‌లో త్వరలో ప్రత్యేకమైన e2ee ట్యాబ్ కనిపించనుందని శ్రీధర్ వెంబు పోస్ట్‌లో పేర్కొన్నారు. దీని సహాయంతో వినియోగదారులు ప్రతి వ్యక్తిగత చాట్‌కు విడివిడిగా ఎన్‌క్రిప్షన్‌ను ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సంస్థ రెండు విధానాలను పరిశీలిస్తోంది. యూజర్ కోరితే, అన్ని పర్సనల్ చాట్స్‌కు డిఫాల్ట్‌గా E2EE అమలు చేయడం..లేదా యూజర్ ఎంపిక చేసిన వ్యక్తిగత చాట్‌లకు మాత్రమే ఎన్‌క్రిప్షన్ అమలు చేయడం. ఇద్దరిలో ఎవరు అయినా ఒకరు ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసినా, ఆ చాట్ ఆటోమేటిక్‌గా సురక్షితం అవుతుందని ఆయన తెలిపారు. రెండో విధానంలో అయితే, అన్ని ప్రైవేట్ చాట్స్ డిఫాల్ట్‌గా సురక్షితంగా ఉంటాయి, అంటే ప్రతి వ్యక్తిగత సందేశం ఆటోమేటిక్‌గా ఎన్‌క్రిప్ట్ అవుతుంది.
వివరాలు
క్లౌడ్ ఆధారిత చాట్ సేవలు
వెంబు ప్రకారం, "కొంతమంది యూజర్లు తమ డివైజ్ స్టోరేజ్ పరిమితిని దృష్టిలో పెట్టుకుని క్లౌడ్ ఆధారిత చాట్ సేవలను ఇష్టపడతారు. అందుకే మేము మొదటి ఆప్షన్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం. రెండో ఆప్షన్ కూడా తక్కువ వ్యయంతో సులభంగా అమలు చేయగలుగుతాం" అని పేర్కొన్నారు. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, అరట్టై యాప్ కూడా సిగ్నల్, వాట్సాప్ వంటి ప్రైవసీ ప్రధాన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల సరసన నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సదుపాయంతో మెసేజ్‌లు పంపిన వారు, స్వీకరించిన వారు మాత్రమే చదవగలరు, మధ్యవర్తులు లేదా సంస్థ సిబ్బంది ఆ డేటాను చూడలేరని వెంబు స్పష్టం చేశారు.